విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తిత్లీ తుఫాన్ ధాటికి ఉత్తరాంధ్రలోని సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. భారీ అలలతో సముద్రుడు దూసుకువస్తున్నాడు. దీంతో తీర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్ననారు. తిత్లీ తుఫాన్ వాయువ్యం దిశగా గంటకు పదికిలోమీటర్ల వేగంతో కదులుతుంది. 

ప్రస్తుతం తూర్పుమధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఆగ్నేయ దిశగా గోపాల్ పూర్ కు 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అలాగే కళింగ పట్నంకు 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న15 గంటల్లో తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. 

తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశించింది.  

గురువారం తుఫాన్ గోపాల్ పూర్-కళింగపట్నంల మధ్య  తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. తుఫాన్ తీరం దాటే సమయానికి గంటకు 120 నుంచి 140కి.మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశ ఉందని తెలిపింది. తుఫాన్ ప్రభావంతో కళింగపట్నం పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. 

తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్రకు ఎక్కువగా ఉండటంతో ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. సముద్ర తీర ప్రాంతాల్లోని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు. మరోవైపు మంగళగిరి నుంచి ఉత్తరాంధ్రకు నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి.