తుఫాను పరిస్థితుల మీద టీడీపీ నేత కింజారపు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి జగన్ కు బహిరంగ లేఖ రాశారు.  రాష్ట్రంలో నివర్ తుఫాను, అంతకుముందు కురిసిన వర్షాలు, వరదలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. 

ఈ ఏడాది అక్టోబర్ లో వాయుగుండంతో కోతకొచ్చిన పంట పాడైపోగా.. ఇప్పుడు నివర్ తుఫానుతో చేతికొచ్చిన పంట దెబ్బతింది. వేలాది ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, చెరకు, కంది, చిరుధాన్యాల పంటలు నీట మునిగాయి. అతిభారీ వర్షాలు చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపగా.. గుంటూరు, కృష్ణ, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ నష్టం వాటిల్లింది. 

నివర్ తుఫాను వల్ల వ్యవసాయ, ఉద్యాన శాఖల పరిధిలో సుమారు 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా. రూ.1000 కోట్లపైన పంట నష్టం వాటల్లింది. నివర్ తుఫాను ప్రభావంతో గుంటూరు జిల్లాలో 2.60 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లాలో 70వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రకాశం జిల్లాలో 3,625 ఎకరాల్లో ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. 

ప్రస్తుతం ఖరీఫ్, రబీలకు సంబంధించి 8 జిల్లాల్లో 47.73 లక్షల ఎకరాల్లో పంటలున్నాయి. ఇందులో 13.59 లక్షల ఎకరాల్లో వరి ఉండగా.. అధికశాతం కోతకు వచ్చింది. ప్రాథమిక అంచనా ప్రకారం 4.29 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతింది. తూర్పుగోదావరి జిల్లాలో 31వేలు, విశాఖపట్నం 16,300, చిత్తూరు జిల్లాలో 19వేలు, నెల్లూరు 17,900 ఎకరాల వరకు పంటలు దెబ్బతిన్నాయి. వరుస విపత్తులతో అప్పులు తెచ్చి పంటలు సాగుచేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. 

అక్టోబర్ లో కురిసిన వర్షాలకు వారంపాటు ముంపులో మునిగి ఉంటేనే నిత్యావసర వస్తువులు ఇస్తామన్న మీరు.. ఇప్పుడు నివర్ తుఫాను వల్ల నష్టపోయిన వారి పరిస్థితి ఏంటో చెప్పాలి. లక్షలాది ఎకరాలు నీట మునిగి కష్టాల్లో ఉన్న రైతులను కనీసం పట్టించుకోలేదు. మనోధైర్యం చెప్పేవారు కూడా కరువమయ్యారు. 

బూతులు తిట్టడంలో ఆరితేరిన మంత్రులు.. రైతులను పరామర్శించడానికి మాత్రం నోరు పెగల లేదు. అక్టోబర్ లో కురిసిన వర్షాలకు గోదావరి జిల్లాల్లో ముంపు ఎక్కువగా ఉంటే.. అమరావతి మునిగిందా లేదా అని గాల్లో చక్కర్లు కొట్టి మీరు చేతులు దులుపుకున్నారు. వరద ఎంత వస్తుందో ముందే అంచనా వేసి తగిన జాగ్రత్తలు చేపట్టడంలోనూ విఫలమయ్యారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు గారి ఇంటిని ముంచేందుకు కుట్ర పన్ని రైతుల పంటలను బలిచేశారు. 

టీడీపీ ఐదేళ్ల పాలనలో 3,759 కోట్ల రూపాయల ఇన్ పుట్ సబ్సీడీని విడుదల చేశాం . మీ పాలనలో 18 నెలల్లో కేవలం 135.73 కోట్లు మాత్రమే విడుదల చేయడం రైతుల సంక్షేమం పట్ల మీ చిత్తశుద్ధికి నిదర్శనం. హుద్ హుద్, తిత్లీ సమయంలో టీడీపీ ప్రభుత్వం సత్వరం స్పందించి రైతులను ఆదుకుంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తిత్లీ, పెథాయ్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు తెలుగుదేశం ప్రభుత్వం రూ.159.96 కోట్లు చెల్లించింది. ప్రకృతి విపత్తుల కింద నష్టపోయిన పంటలకు టీడీపీ ప్రభుత్వం నష్టపరిహారాన్ని సుమారు 50 శాతం నుంచి 100 శాతం వరకు పెంచడం జరిగింది. మీరు మాత్రం కేవలం 15 శాతం పెంపునకే పరిమితం అయ్యారు.

ఇప్పటికైనా వరుస విపత్తులతో తీవ్రంగా నష్టపోయి, కష్టాల ఊబిలో చిక్కుకున్న రైతులను ఆదుకోవాలి. దెబ్బతిన్న పంటలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. పంట నష్ట పరిహారాన్ని త్వరితగతిన అందజేయాలని తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేస్తోందని ఈ లేఖలో పేర్కొన్నారు.