ఏపీలో జూన్ 20వరకు కర్ఫ్యూ పొడగింపు: జూన్ 10 తర్వాత సమయంలో సడలింపు
కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 20వ తేదీ వరకు కర్ఫ్యూను పొడగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, జూన్ 10 తర్వాత కర్ఫ్యూ సమయంలో సడలింపు ఇవ్వనుంది.
అమరావతి: రాష్ట్రంలో కర్ఫ్యూను పొడగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 20వ తేదీ వరకు కర్ఫ్యూను పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 10 తేదీ తర్వాత కర్ఫ్యూ సమయంలో సడలింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సమయంలో సడలింపు ఇవ్వనుంది. ప్రస్తుతం ప్రతి రోజూ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంది.
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కర్ఫ్యూను పొడగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కర్ఫ్యూ వల్ల సానుకూల ఫలితాలు వచ్చినట్లు గుర్తించింది. కరోనా వైరస్ వ్యాప్తిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం సమీక్షించారు.
కర్ఫ్యూ సడలింపు సమయం పెంచిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తాయి. కరోనా కేసులను మరింత తగ్గించడానికి కర్ఫ్యూను పొడగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమయంలో మాత్రమే జూన్ 10 తర్వాత సడలింపు ఉంటుంది. మిగతా నియమ నిబంధనలు యధావిథిగా కొనసాగుతాయి.
వాక్సినేషన్ మీద కూడా సమావేశంలో చర్చ జరిగింది. కరోనా వ్యాక్సిన్ ను అందించే బాధ్యతను కేంద్రం తీసుకోవాలని జగన్ కోరుతున్నారు. ఈ మేరకు ఆయన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు కూడా రాశారు.