విశాఖపట్నం: పేగు బంధం కంటే అక్రమ సంంబంధమే ఎక్కువని భావించిన ఓ కసాయి మహిళ కన్న కూతురినే చంపేసిందని గ్రామస్తులు ఆరోపిస్తున్న ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. పాడేరు సమీపంలోని ఓ గ్రామంలో చిన్నారి అనుమానాస్పద రీతిలో మరణించగా  ప్రియుడితో కలిసి తల్లే చిన్నారిని చిదిమేసినట్లు అనుమానిస్తున్నారు. 

ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. లగిశపల్లి పంచాయతీ పార్వతీపురం గ్రామ సమీపంలోని ఓ కోళ్ల ఫారంలో  గొల్లోరి రాంబాబు అనే వ్యక్తి పనిచేసేవాడు. భార్యతో పాటు ఐదేళ్ళ కూతురితో కలిసి ఈ పౌల్ట్రీ ఫామ్ వద్దే నివాసముండేవారు. ఈ క్రమంలోనే కోళ్ల ఫారం యజమాని కమలాకర్ తో రాంబాబు భార్య వివాహేతర సంబంధాన్ని ఏర్పర్చుకుంది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో కోళ్లఫారంలో పని మానేసిన రాంబాబు కుటుంబంతో స్వగ్రామానికి వెళ్లిపోయాడు. 

ఇటీవలే స్వగ్రామం తడిగిరికి చేరుకున్న రాంబాబు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఈ దంపతుల ఐదేళ్ల కూతురు శ్రీవల్లి అనుమానాస్పద రీతిలో మరణించింది. చిన్నారి శరీరంపై గాయాలుండటంతో పాటు కడుపు ఉబ్బిపోయి వుంది. అక్రమ బంధానికి అడ్డుగా వుందని ప్రియుడితో కలిసి తల్లే చిన్నారిని హత్యచేసి వుంటుందని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. రాంబాబు కూడా భార్యే తన కూతురిని హతమార్చిందని ఆరోపిస్తున్నాడు. 

అభం శుభం తెలియని తన కూతురిని భార్య, కోళ్లఫారం యజమాని కమలాకర్‌ చంపేశారని రాంబాబు, అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని కోళ్లఫారం యజమాని కమలాకర్, మృతురాలి తల్లిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.