రైతులను ముంచుతున్న అకాల వర్షాలు.. పంటలను దెబ్బ కొడుతున్న వడగండ్ల వానలు
Vijayawada: ఊహించని విధంగా కురుస్తున్న అకాల వర్షాలతో రబీ పంట దెబ్బతింటుందని కృష్ణా డెల్టా రైతులు ఆందోళన చెందుతున్నారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయనీ, మరో 48 గంటల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దాదాపు అన్ని కోస్తా జిల్లాలు, కొన్ని రాయలసీమ జిల్లాల్లో శుక్రవారం తెల్లవారు జామున చిరుజల్లులతో వర్షం ప్రారంభమైంది. అయితే మధ్యాహ్నానికి పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.

Unseasonal rains cause crop damage: అకాల వర్షాలు రైతులను నట్టేటా ముంచుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. అకాల వర్షాలతో రబీ పంట దెబ్బతింటుందని కృష్ణా డెల్టా రైతులు ఆందోళన చెందుతున్నారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని, మరో 48 గంటల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దాదాపు అన్ని కోస్తా జిల్లాలు, కొన్ని రాయలసీమ జిల్లాల్లో శుక్రవారం తెల్లవారు జామున చిరుజల్లులతో వర్షం ప్రారంభమైంది. అయితే మధ్యాహ్నానికి పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.
కృష్ణా జిల్లాలోనూ ఉరుములతో కూడిన వర్షం కురిసింది. జిల్లాలో 9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఊహించని వర్షాలకు అనేక పంటలు, ముఖ్యంగా మినుము పంట దెబ్బతింది. కృష్ణా డెల్టాలో దశాబ్ద కాలంగా రబీలో మినుము ప్రధాన పంటగా ఉంది. పంట కోత కాలం 60-70 రోజులు ఉంటుంది. ఈ ఏడాది కృష్ణా డెల్టాలో 3.50 లక్షల ఎకరాల్లో మినుము పంట సాగు చేస్తుండగా, అందులో ఒక్క కృష్ణా జిల్లాలోనే 2.63 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు 30 శాతం పంట కోత పూర్తయినట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తమ ఆశలను పూర్తిగా నీరుగార్చాయని కృష్ణా జిల్లా రైతులు పేర్కొంటున్నారు. తమ పంటలు కోతకు సిద్ధంగా ఉన్నాయి, కానీ ఊహించని ఈ వర్షం మినుము పంటను దెబ్బతీసిందని చెబుతున్నారు.
తెలంగాణలోనూ..
తెలంగాణలోనూ చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో కురిసిన అకాల వర్షాలకు పాలమూరు వ్యాప్తంగా మామిడి, వరి రైతులకు కోలుకోలేని నష్టం వాటిల్లింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా.. ముఖ్యంగా కొల్లాపూర్, వనపర్తి, అలంపూర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని ప్రాంతాలు మామిడి పంటలకు ప్రసిద్ధి చెందాయి. మామిడి పంటకు ఇదే సరైన సీజన్ కావడంతో నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో కురిసిన భారీ వడగండ్ల వానతో వరి పంట, మామిడి పంటకు నష్టం వాటిల్లింది. నాగర్ కర్నూల్ జిల్లాలో 40 వేల ఎకరాల్లో రైతులు మామిడి తోటలు సాగు చేయగా, ఇటీవల కురిసిన వర్షాలకు 70 శాతానికి పైగా మామిడి తోటలు దెబ్బతినడంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
గత 24 గంటల్లో కురిసిన వడగండ్ల వానకు కొల్లాపూర్ లో మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా మామిడి పంటకు ఇదే సరైన సమయం. వేలాది మంది మామిడి రైతులు పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టారు. కానీ వడగళ్ల వానతో పూలు, చిన్న మామిడి పిందెలు రాలిపోయాయని, ఇది పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని వనపర్తి జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురుగాలులకు కొన్ని చోట్ల చెట్లు నేలకొరగగా, పలుచోట్ల ఈదురుగాలులు, వడగండ్ల వానకు మామిడి తోటల్లోని మామిడి కాయలు రాలడంతో రైతులకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది.
ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల జిల్లా యంత్రాంగం ఇప్పటికే సంబంధిత వ్యవసాయ, ఉద్యానవన అధికారులను ఆదేశించింది. జిల్లాలో వడగండ్ల వానల వల్ల జరిగిన నష్టంపై త్వరలోనే అధికారులు జిల్లా కలెక్టర్లకు నివేదిక సమర్పించనున్నారు. గడిచిన 24 గంటల్లో ఒక్క నాగర్ కర్నూల్ జిల్లాలోనే 2830 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందనీ, ఈదురుగాలులతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వడగండ్ల వానలు, పిడుగుల కారణంగా ఎలాంటి నష్టం, మరణాలు సంభవించకుండా రైతులు, గొర్రెల కాపరులు, ఇతరులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.