Asianet News TeluguAsianet News Telugu

ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ లో అమరావతి బాండ్లకు భారీ గిరాకీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం సీఆర్డీఏ విడుదల చేసిన అమరావతి 2018 బాండ్లు స్టాక్ మార్కెట్లో రికార్డులు సృష్టించాయి. గంట వ్యవధిలో ఒకటిన్నర రెట్లు ఓవర్ సబ్ స్క్రైబ్ అయి నూతన అధ్యయనానికి నాంది పలికాయి. ముంబాయి స్టాక్ ఎక్స్చేంజిలో ట్రేడింగ్ అవుతూనే గంట వ్యవధిలో 2 వేల కోట్ల రూపాయలను ఆర్జించాయి. 
 

crda gathering funds from bonds
Author
Amaravathi, First Published Aug 14, 2018, 4:15 PM IST

ముంబై:
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం సీఆర్డీఏ విడుదల చేసిన అమరావతి 2018 బాండ్లు స్టాక్ మార్కెట్లో రికార్డులు సృష్టించాయి. గంట వ్యవధిలో ఒకటిన్నర రెట్లు ఓవర్ సబ్ స్క్రైబ్ అయి నూతన అధ్యయనానికి నాంది పలికాయి. ముంబాయి స్టాక్ ఎక్స్చేంజిలో ట్రేడింగ్ అవుతూనే గంట వ్యవధిలో 2 వేల కోట్ల రూపాయలను ఆర్జించాయి. 

సీఆర్డీఏ తొలివిడతగా 1300 కోట్ల రూపాయల బాండ్లను విడుదల చేయగా అనూహ్యంగా గంట వ్యవధిలోనే 1.5 రెట్లు ఓవర్ సబ్ స్క్రైబ్ అయి 2వేల కోట్ల రూపాయల మార్కెట్‌ను సృష్టించాయి. తొలి బిడ్‌లో 600 బాండ్లను సంస్థాగత మదుపరులు దక్కించుకున్నారు. ఆ తర్వాత గంట వ్యవధిలో అన్ని బాండ్లనూ దక్కించుకునేందుకు మదుపరులు పోటీ పడ్డారు. 

దీంతో బాండ్లు ఒకటిన్నర రెట్లు ఓవర్ సబ్ స్క్రైబ్ అయినట్లు బోంబే స్టాక్ ఎక్చ్సేంజీలో నమోదైంది. బీఎస్ఈలో తొలిసారి అమరావతి బాండ్లు ట్రేడింగ్ అవుతున్న విధానాన్ని సీఆర్డీఏ ఉన్నతాధికారులు చాలా ఉత్కంఠతో పరిశీలించారు. బాండ్లకు సంస్థాగత మదుపరుల నుంచి అనూహ్య స్పందన రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా మున్సిపల్ బాండ్లలో ఓ స్థానిక నగరాభివృద్ధి సంస్థ జారీ చేసిన బాండ్లకు ఈ స్థాయిలో ఆనూహ్య స్పందన రావటం ఇదే తొలిసారని  సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ స్పష్టం చేశారు. 

ఇప్పటివరకూ దేశంలోని మున్సిపాలిటీలు జారీ చేసిన మొత్తం బాండ్ల విలువ 1800 కోట్ల రూపాయలైతే.. ఒక్క సీఆర్డీఏ గంట వ్యవధిలోనే బాండ్ల ద్వారా 2వేల కోట్ల రూపాయల నిధుల్ని సేకరించడం రికార్డు బ్రేక్ అన్నారు. అమరావతి బాండ్లకు తాము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చినట్లు  తెలిపారు.  1300 కోట్ల నిధుల సేకరణ అంచనా వేస్తే ఏకంగా 2వేల కోట్ల రూపాయలకు పైగా ఓవర్‌ సబ్‌ స్క్రైబ్ అవ్వడం సంతోషకరమన్నారు. మున్సిపల్‌ బాండ్ల కేటగిరీలో ఇంత భారీ మొత్తంలో సబ్‌స్ర్కైబ్‌ కావడం దేశంలో ఇదే తొలిసారన్నారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన సలహాతోనే అమరావతి బాండ్లను స్టాక్‌మార్కెట్‌లో ప్రవేశపెట్టామన్నారు. రాబోయే రోజుల్లో రిటైల్‌ బాండ్లను కూడా ప్రవేశపెడతామని తెలిపారు. రాజధాని నిర్మాణానికి బాండ్ల ద్వారా  10వేల కోట్లరూపాయలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అందులో భాగంగా తొలి విడతగా 1300 కోట్ల రూపాయల విలువైన బాండ్లను విక్రయించినట్లు చెప్పారు. దశలవారీగా మిగిలిన బాండ్లను కూడా స్టాక్‌మార్కెట్‌లో ప్రవేశపెడతామని సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios