హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ రివర్స్ గేర్‌లో పాలిస్తున్నారని చెప్పుకొచ్చారు. అది చాలా ప్రమాదకరమన్నారు. 

రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించడం మంచి పరిణామమేనని అందుకు తాను కూడా మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అయితే మరింత ఎక్కువగా అవినీతి జరుగుతుందని దాన్ని ఉపేక్షించకూడదన్నారు. ఈ సందర్భంగా రివర్స్ టెండరింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నారాయణ. 

రివర్స్ టెండరింగ్ ద్వారా డబ్బు ఆదా చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెప్తోందని అది మంచిదేనన్నారు. అయితే రివర్స్ టెండరింగ్ ద్వారా కాంట్రాక్ట్ తీసుకున్న వారికి మరో విధానంలో ప్రభుత్వం సాయపడకూడదన్నారు. కోడలు మగపిల్లాడుని కంటానంటే అత్తవద్దంటుందా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఎవరైతే రివర్స్ టెండరింగ్ లో కాంట్రాక్ట్ లు స్వాధీనం చేసుకున్నారో భవిష్యత్ లో ఏ కాంట్రాక్ట్ కట్టబెట్టకూడదన్నారు. కట్టబెట్టకుండా చూడగలరా అని నిలదీశారు. తక్కువ సొమ్ముకు ప్రాజెక్టులను దక్కించుకున్న కంపెనీలకు భవిష్యత్ లో లాభం చేకూరే టెండర్లు కట్టబెట్టరని సీఎం జగన్ చెప్పగలరా అని నిలదీశారు. 

వైసీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాజకీయాల్లో విబేధాలు ఉండొచ్చు కానీ కక్షలు ఉండకూదన్నారు. జగన్ మాత్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారంటూ నారాయణ మండిపడ్డారు.