గుంటూరు: కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా పై సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అమిత్ షా కు హోంశాఖ ఇవ్వడం చంబల్ లోయ దొంగకు బ్యాంకు తాళాలు ఇచ్చినట్లేనని విమర్శించారు. 

12 క్రిమినల్‌ కేసుల్లో ముద్దాయిగా ఉన్న అమిత్‌షాను హోంమంత్రిగా నియమించడం దేశంలో అప్రజాస్వామిక పాలనకు ప్రధాని మోదీ తెరతీశారని అభిప్రాయపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ఎన్డీఏ ప్రస్తుతం అభివృద్ధివైపు కాకుండా కక్ష సాధింపులు, మతరాజ్య స్థాపన దిశగా అడుగులేవేస్తోందని మండిపడ్డారు. 

కేంద్ర మంత్రుల్లో 56 మంది వందల కోట్లకు అధిపతులైతే 20 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి దేశంలో 37 శాతం మంది ప్రజలు మాత్రమే మద్దతు ఇచ్చారని 63 శాతం మంది తిరస్కరించారని చెప్పుకొచ్చారు. 

లోపభుయిష్టమైన ఈ ఎన్నికల విధానం వలన నిజమైన ప్రజాస్వామ్యం కనపడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవీఎంలలో లోపాలున్నాయని అన్ని రాజకీయ పక్షాలు మొత్తుకుంటున్నా ఈసీ స్పందించకపోవడం అప్రజాస్వామికమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంలు బ్యాన్‌ చేస్తుంటే మనం వాటిమీదే ఆధారపడటం ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పోగొట్టడానికి నిదర్శనమని సీపీఐ నారాయణ వ్యాఖ్యానించారు.