రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దురుద్దేశంతోనే ప్రధాని మోదీ పర్యటించారని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. ప్రధాని మోదీ రాజకీయ దురుద్దేశంతో పర్యటించిన నేపథ్యంలోనే గో బ్యాక్ మోదీ అని అనాల్సి వచ్చిందన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దురుద్దేశంతోనే ప్రధాని మోదీ పర్యటించారని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. ప్రధాని మోదీ రాజకీయ దురుద్దేశంతో పర్యటించిన నేపథ్యంలోనే గో బ్యాక్ మోదీ అని అనాల్సి వచ్చిందన్నారు. ఆదివారం నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీతో బంధం కొననసాగిస్తూనే.. టీడీపీని బలహీనపరచాలని మోదీ కోరుకుంటున్నారని ఆరోపించారు. ఏపీని అభివృద్ది చేయాలనే ఉద్దేశం మోదీకి లేదని విమర్శించారు. 

‘‘మోదీ దృష్టిలో ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాల్సిందే. ఇక్కడ బలంగా ఉంటేనే కేంద్రంలో వాళ్లకు సపోర్ట్ చేస్తారు. ఆ పార్టీని బలంగా ఉండటం కంటిన్యూ చేస్తూనే టీడీపీని బలహీనపరచాల్సిందే. ఎందుకంటే టీడీపీ బలహీనంగా ఉంటే తప్ప బీజేపీ బలపడదు. అందుకే పవన్ కల్యాణ్ టీడీపీ పక్కకు పోకూడదు. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రికి ఒక్క రోజు ముందు ఆఫీసర్‌తో చిన్న చిటీ పంపించారు.. అక్కడ పవన్ కల్యాణ్‌కేమో మర్యాదలతో ఆహ్వానించారు. టీడీపీ వైపు పోవద్దు.. బీజేపీ, జనసేన కలిసే ముందుకు వెళ్దామని పవన్‌తో మోదీ చెప్పి ఉంటారు. అప్పుడు టీడీపీ వేరు అయిపోతుంది.. అది బలహీనపడిపోతుంది’’ అని అన్నారు. 

రాజకీయ ఎత్తుగడల రీత్యా ఏపీ పర్యటనకు మోదీ వచ్చారని విమర్శించారు. ఏపీని అభివృద్ది చేయాలనే ఉద్దేశం మోదీకి లేదని అన్నారు. తెలంగాణలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతో మోదీ వచ్చారని ఆరోపించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దురుద్దేశంతోనే ప్రధాని మోదీ పర్యటించారని మండిపడ్డారు. రెండు రాష్ట్రాల్లో బీజేపీ బలపడాలని చేస్తున్న కుటిల ప్రయత్నాన్ని తాము గమనిస్తున్నామని చెప్పారు. బీజేపీ వ్యతిరేక శక్తులతో సీపీఐ పని చేస్తుందని చెప్పారు. 

కేసీఆర్‌కు వ్యతిరేకంగ పనిచేసినప్పుడు పోలీసులు ఎప్పుడూ తమ పార్టీ కార్యాలయంలోకి రాలేదని నారాయణ అన్నారు. కానీ శనివారం మోదీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని చూసినప్పుడు మాత్రం పార్టీ కార్యాలయంలోనికి వచ్చారని చెప్పారు. అయితే పోలీసులు తెలంగాణ సీఎం చేతిలో ఉన్నారా? మోదీ చేతులో ఉన్నారా? అనేది కేసీఆర్ ఆలోచించుకోవాలని చెప్పారు. 

సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదేని అయితే బ్లాక్‌ల కేటాయింపు అధికారం కేంద్రం చేతిలోనే ఉందని నారాయణ అన్నారు. సింగరేణి గనుల చుట్టు బొగ్గు బ్లాక్‌లను ప్రైవేట్‌కు కట్టబెడుతున్నారని చెప్పారు. క్రమంగా సింగరేణి సంస్థను చంపేయడమే ప్రధాని మోదీ లక్ష్యమని వెల్లడించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 90 కంటే ఎక్కువ బొగ్గు బ్లాక్‌లను అమ్మేశారని విమర్శించారు.