విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు థ్యాంక్స్ చెప్పాలని సీపీఐ నేత నారాయణ అన్నారు. వైఎస్ జగన్ చర్యల వల్ల చంద్రబాబుకు తిరిగి ప్రజల్లోకి వెళ్లే అవకాశం వచ్చిందని, అందుకు చంద్రబాబు జగన్ కు థ్యాంక్స్ చెప్పాలని ఆయన అన్నారు. శనివారం జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. 

నార్కో ఎనాలిసిస్ టెస్టులు జరిపితే జగన్ తప్ప అందరూ అమరావతి రాజధానిగా ఉండాలని అంటారని ఆయన అన్నారు. అమరావతి నుంచి రాజధానిని తరలించడం బిజెపి ఇజ్జత్ కా సవాల్ అని ఆయన అన్నారు. రాజధాని ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారని ఆయన గుర్తు చేశారు. 

వైఎస్ జగన్ ది ఫ్యాక్షనిస్టు ఆలోచనా ధోరణి అని నారాయణ అన్నారు. వాస్తవానికి, అవాస్తవానికి మధ్య జరుగుతున్న పోరాటంలో అమరావతి గెలుస్తుందని ఆయన అన్నారు. అమరావతి కోసం దీర్ఘకాలిక రాజకీయ పోరాటం అవసరమని ఆయన అన్నారు. విశాఖ, అమరావతిల్లో సిట్ లు వేశారని, ఇంత వరకు ఏ ఒక్క రిపోర్టు కూడా రాలేదని ఆయన అన్నారు. 

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగితే జగన్ చర్యలు తీసుకోవచ్చునని ఆయన అన్నారు. విపక్షాలను ఏకం చేసిన ఘనత కూడా జగన్ కు దక్కుతుందని ఆయన అన్నారు. 

రాజధానిగా అమరావతి ఉండాల్సిందేనని వంగవీటి రాధాకృష్ణ అన్నారు. చంద్రబాబు ప్రారంభించిన హైటెక్ సిటీని వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొనసాగించారని, జగన్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఏపీలో చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి పనులను జగన్ కొనసాగించడం లేదని ఆయన అన్నారు.