తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అపశృతి చోటు చేసుకుంది. పిఠాపురంలోని  స్థానిక ప్రభుత్వాసుపత్రి నుంచి మండలంలోని విరవ ఆస్పత్రికి తరలించిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వయల్స్‌ పగిలిపోయాయి. ఈ సంఘటన వైద్య, ఆరోగ్య శాఖలో కలకలం రేపింది. 

ఆలస్యంగా తెలిసిన వివరాల మేరకు.. పిఠాపురం ప్రభుత్వాసుపత్రి నుంచి 6 వయల్స్‌ను ప్రత్యేక బాక్సులో విరవ ఆస్పత్రి హెల్త్‌ సూపర్‌వైజర్‌ రమణ, హెడ్‌ కానిస్టేబుల్‌ ఏసు విరవ ఆస్పత్రికి ఆదివారం తీసుకువెళ్లారు. 

వైద్య సిబ్బంది వాటిని తెరచి చూడగా 3 వయల్స్‌ పగిలిపోయి ఉన్నాయి. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. పగిలిన మూడు వయల్స్‌తో 30 మందికి వ్యాక్సిన్‌ వేయాల్సి ఉంది. అవి పగిలిపోవడంతో విచారణ చేపట్టారు. 

దీనిపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి సమాచారం మేరకు పిఠాపురం రూరల్‌ ఎస్సై పార్థసారథి తన సి బ్బందితో ఆస్పత్రికి వెళ్లి జరిగిన సంఘటనపై వై ద్యాధికారి విద్యాసాగర్‌ ఆధ్వర్యంలో విచారణ జరిపారు. 

అయితే, హెల్త్‌ సూపర్‌వైజర్‌ రమణ పిఠాపు రం నుంచి వ్యాక్సిన్‌ తీసుకువస్తుండగా ప్రమాదం జరిగి వ్యాక్సిన్‌ ఉన్న బాక్స్‌ కింద పడిపోయిందని, దీనివల్ల మూడు వయల్స్‌ పగిలిపోయాయని జిల్లా కలెక్టర్‌ డి.మురళీధరరెడ్డి తెలిపారు.