ఓ లాడ్జీలో ఇద్దరు కూతుళ్లతో కలిసి దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఎన్టీఆర్ జిల్లాకేంద్రం విజయవాడలో చోటుచేసుకుంది. 

విజయవాడ: ఇద్దరు కూతుళ్లతో కలిసి దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆర్థిక కష్టాలు, అప్పుల బాధ ఎక్కువవడంతో విజయవాడలోని ఓ లాడ్జ్ లో గతకొంతకాలంగా తలదాచుకుంటున్న కుటుంబం పురుగుల మందుతాగి బలవన్మరణానికి యత్నించింది. అయితే లాడ్జి సిబ్బంది, పోలీసులు సకాలంలో స్పందించడంతో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు.

వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన జూపూడి వెంకటేశ్వరరావు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేందుకు బాగా అప్పులు చేసాడు. తాజాగా అప్పులు తీర్చాలంటూ వేధింపులు ఎక్కువవడంతో కుటుంబంతో సహా విజయవాడకు వెళ్లాడు. కొద్దిరోజులుగా విజయవాడ ఆర్టిసి బస్టాండ్ ఔట్ గేట్ సమీపంలోని బాలాజీ లాడ్జిలో వెంకటేశ్వరరావు కుటుంబం నివాసముంటోంది.

ఇలా అప్పుల బాధతో పుట్టిపెరిగిన ఊరిని, ఇంటిని వదిలి నెలరోజులకు పైగా గడిచింది. ఇలా ఎంతకాలం జీవించాలని భావించారో ఏమో కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నివాసముంటున్న లాడ్జీలోనే మొదట కూతుళ్లు భావన, శ్రావణితో ట్రైసిన్ పౌడర్ అనే పురుగుల మందు తాగించిన రాధారాణి-వెంకటేశ్వరరావు దంపతులు చివరకు వారుకూడా తాగారు. దీంతో తీవ్ర అస్వస్ధతకు గురవగా లాడ్జీ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. 

కృష్ణలంక పోలీసులు హుటాహుటిని లాడ్జీకి చేరుకుని అస్వస్థతకు గురయిన నలుగురి చేత బాగా ఉప్పునీరు తాగించారు. దీంతో వాంతి చేసుకోవడంతో కడుపులోకి చేరిన విషంకూడా బయటకు వచ్చింది. వెంటనే వారిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందేలా చూసారు. ఇలా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో వెంకటేశ్వర రావు కుటుంబసభ్యులంతా ప్రాణాలతో భయటపడ్డారు. 

కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు దగ్గరి బంధువైన ఒకరికి వీరు మెసేజ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అప్పుల బాధ తాళలేకే వెంకటేశ్వరరావు కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.