సంక్రాంతి సమయంలో పందెం కోళ్లకు భలే గిరాకి ఉంటుంది. కోళ్లలో ఎన్ని రకాల జాతులు ఉన్నాయి?  ప్రధాన రంగులేమిటి? వాటికి ఎలా శిక్షణ ఇస్తారు? ఎంత ధర పలుకుతాయి? ఓడిపోయిన కోళ్లను.. ఏం చేస్తారు? 

సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగు లోగిళ్లు ముగ్గులు, పిండి వంటలు, గంగిరెద్దులు, పతంగుల సందడితో నిండిపోతాయి. ఇక ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కోడిపందాలు. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి వచ్చిందంటే ఈ కోడి పందాలు జోరుగా సాగుతాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా పోటీలను నిర్వహిస్తుంటారు. కోడిపందాల వెనుక కోట్ల రూపాయల్లో డబ్బు చేతులు మారుతుంది. కోడిపందాలను ప్రభుత్వం నిషేధించినప్పటికీ.. జరుగుతూనే ఉంటాయి. ఎన్ని ఆంక్షలు పెట్టినా వీటిని అడ్డుకోవడం అంత సులభం కాదు. ఈ పందాల కోసం కోళ్లను ప్రత్యేకంగా పెంచుతారు. జీడిపప్పు, బాదం, పిస్తాలు పెట్టి దిట్టంగా తయారుచేస్తారు.

ఇక పందెం కోళ్లకు స్పెషల్ డైలీ రొటీన్ ఉంటుంది. వాటి జాతులను బట్టి ధర ఉంటుంది. అది కూడా వేల నుంచి లక్షల్లో ఉంటుంది. పందెం కోడి రంగును బట్టి కూడా ధర పలుకుతుంది. మొత్తంగా సంక్రాంతి సమయంలో పందెం కోళ్లకు భలే గిరాకి ఉంటుంది. కోళ్లలో ఎన్ని రకాల జాతులు ఉన్నాయి? ప్రధాన రంగులేమిటి? వాటికి ఎలా శిక్షణ ఇస్తారు? ఎంత ధర పలుకుతాయి? ఓడిపోయిన కోళ్లను.. ఏం చేస్తారు? 

సీతమ్మకు నేతకారుడి అద్భుత కానుక.. 196 అడుగుల భారీ చీర.. 13 భాషల్లో 32,200 సార్లు "జై శ్రీ రామ్"... (వీడియో)

సంక్రాంతి కోడిపందాల్లో పాల్గొనే కోళ్లలో సేలం కోడికి మంచి డిమాండ్ ఉంటుంది. ఈ కోడి ధర లక్షకు పైగా ఉంటుందంటే నమ్మాల్సిందే. ఈ కోళ్లలో తెల్ల నెమలి, కాకి నెమలి, కాకి డేగ, పూసనెమలి, డేగలాంటి అనేక రకాలు ఉంటాయి. వీటన్నింటికీ వేరువేరుగా ధరలుంటాయి. తెల్ల నెమలి కోడిపుంజు రూ. 35000 ఉంటుంది. కాకి నెమలి ధర రూ. 25000, డేగ ధర రూ. 25000, పూస నెమలి ధర రూ.30వేలు, కాకి డేగ కోడిపుంజు ధర రూ. 20 నుంచి 25వేల వరకు ఉంటుంది. 

ఇక వీటిల్లో కూడా మేలు జాతి పందెం కోళ్ల ధర రూ. 50 నుంచి లక్షన్నర వరకు పలుకుతుంది. ఈ పందెం కోళ్ల ఎంపిక, పెంపకం కూడా జిల్లాలను బట్టి మారుతూ ఉంటుంది. ఉభయగోదావరి, కృష్ణా తదితర జిల్లాల్లో వేలాది రూపాయలు ఖర్చు చేసి పుంజులను సిద్ధం చేస్తుంటారు. తిరుపతి జిల్లాకు చెందినవారు తమిళనాడులోని క్రిష్ణగిరి, సేలం ప్రాంతాల్లో జరిగే వారపు సంతల్లో బెడస, వర్లా, సేతం, డేగ, కాకి, నెమలి లాంటి పందెంకోళ్ల రకాలను ఏరి కోరి తెచ్చుకుంటుంటారు.

వేల రూపాయలు పోసి కోళ్లను తీసుకురాగానే సరిపోదు వాటిని చక్కగా ట్రైనింగ్ ఇస్తేనే పందాల్లో సత్తా చాటుతాయి. దీనికోసం పందెం కోళ్లకు స్పెషల్ డైలీరొటీన్ ఉంటుంది. రోజు పొద్దున్నే ఈ పందెం కోళ్లను చన్నీళ్లలో స్విమ్మింగ్ చేపిస్తారు. దీంతో వీటి దినచర్య మొదలవుతుంది. ఆ తర్వాత ఈ కోళ్లను వాకింగ్, రన్నింగ్ లాంటి వ్యాయామాలు చేపిస్తారు. వీటి తరువాత టిఫిన్. ఇవి కూడా తక్కువేం కాదండోయ్… జీడిపప్పు, బాదంపప్పు, కోడిగుడ్డు లాంటి రిచ్ ఫుడ్డు ఉండాల్సిందే. ఇవి తిన్న కాసేపటికి గంట్లు, చోళ్లు లాంటి మరింత పౌష్టిక ఆహారాన్ని అందిస్తారు.

ఆ తర్వాత విశ్రాంతి చాలా ముఖ్యం. మళ్లీ మధ్యాహ్నం లంచ్ లోకి కూడా కోడిగుడ్డు, బాదంపప్పు, జీడిపప్పు లాంటి రిచ్ ఫుడ్డు ఉండాల్సిందే. భోజనానంతరం మూడు గంటల తర్వాత నుంచి మళ్లీ ఎక్సర్సైజులు మొదలవుతాయి. కాస్త చీకటి పడి.. చలి మొదలవగానే.. మల్లోసారి చన్నీళ్లలో స్విమ్మింగ్ చేయిస్తారు. ఇవన్నీ పూర్తయ్యాక నైట్ డిన్నర్ కూడా మళ్లీ బాదంపప్పు, కోడిగుడ్డు, జీడిపప్పులతో మేపుతారు. ఉదయం కోడి కూసే వేళకు లేచిన కోళ్లు ఈ డైలీ రొటీన్ తో అలసిపోయి.. సాయంత్రం ఏడవగానే నిద్రలోకి జారుకుంటాయి.

సాధారణంగా పందెం కోళ్లకు ఇచ్చే ఆహారం రెగ్యులర్గా జీడిపప్పు, బాదంపప్పు, కోడిగుడ్లే ఉంటాయి. కానీ కొంతమంది మాత్రం మరింత బలంగా తమ కోడిని తయారు చేయాలని.. జీడిపప్పు, ఆక్రోట్, పిస్తా, ఎండు ద్రాక్షలను అన్నింటిని మిక్సీలో వేసి ముద్దగా చేసి.. వాటిని ఆహారంగా ఇస్తారు. అంతేనా.. ఉడికించిన మటన్ కీమా, గుండెకాయ తినిపిస్తారు. పచ్చిగుడ్లు తాగిస్తారు. ఇవన్నీ చూస్తుంటే.. మనిషిగా కంటే పందెం కోడిపుంజై పుట్టిన బాగుండేది అనిపిస్తుంది కదా.. కానీ ఇవి పందెంలో ఓడిపోతే మాత్రం.. చక్కగా కోసి కారం పెట్టేయడమే.