కరోనా వైరస్ మహమ్మారి రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్ లో చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఇటీవల కరోనా వైరస్ బారినపడి మరణించిన వ్యక్తి నుండి 8 మందికి కరోనా సోకింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో గోదావరి జిల్లాలు కరోనా భయంతో వణికిపోతున్నాయి. 

వివరాల్లోకి వెళితే... గురువారం రోజున కరోనా వైరస్ బారినపడి ఒక 53 సంవత్సరాల వ్యక్తి మరణించాడు. ఆయనకు గొల్లలమామిడాడలో ఫోటో స్టూడియో ఉంది. పెండ్లిళ్లకు పేరంటాలకు ఫోటోలు తీసే కాంట్రాక్టును కుదుర్చుకుంటుంటాడు. 

ఇలానే ఇంతకుమునుపు ఒప్పుకున్నా ఒక కాంట్రాక్టుకు సంబంధించిన శుభకార్యం షూటింగ్ కు ఇటీవల రామచంద్రపురం వెళ్లినట్టు వైద్యశాఖ అధికారులు గుర్తించారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాతే సదరు వ్యక్తి వైరస్‌ బారిన పడ్డారని అధికారులు దాదాపుగా ఒక అంచనాకు వచ్చారు. 

ఆ తర్వాత అనపర్తికి వెళ్లి కంటి పరీక్ష చేయించుకున్నాడు. అక్కడ్నించి బిక్కవోలులో మేనకోడలు ఇంటికి వెళ్లాడు. అయితే తనకు కరోనా వైరస్ సోకింది అన్న సంగతి తెలియకపోవడం, ఆయన ఎటువంటి చికిత్స కూడా తీసుకోకపోవడంతో వైరస్‌ కాస్తా ముదిరి ఈయన మృతి చెందాడు. 

శుక్రవారం ఒక్కరోజే ఎనిమిది మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, వీరందరికి సదరు మృతుడి ద్వారా వైరస్‌ వ్యాపించినట్టు అధికారులు గుర్తించారు. ఇందులో ఆరుగురు మృతుడి రక్త సంబంధీకులు, మరికొందరు ఇంటికి దగ్గర్లో నివసిస్తున్న వ్యక్తులు.   

ఇలా గుర్తించిన వాళ్లలో ఓ మహిళ వయ స్సు (50), ఇద్దరు పురుషుల్లో ఒకరిది (40), మరొకరిది (19) ఏళ్లుగా గుర్తించారు. మిగిలిన ముగ్గురిలో ఒకరిది వయస్సు (37) మరొకరిది (50), ఇంకొకరిది (59)గా నిర్ధారించారు. మరో ఇద్దరు బాధితులు బిక్కవోలులో తేలారు. ఇందులో 50 ఏళ్ల మహిళ.. మృతి చెందిన వ్యక్తికి మేనకోడలు వరుస అవుతారు. 

వీరిని చూసేందుకు సదరు ఫోటో స్టూడియో నడిపే వ్యక్తి ఈనెల 15న బిక్కవోలు వచ్చి ఒకరోజు అక్కడే ఉన్నాడు. ఇలా వారింట్లోనే గడపడంతో ఆయన మేన కోడలితోపాటు ఆమె మనవడు (17)కి కూడా కరోనా సోకింది. 

వైరస్ బయటపడడంతో ఈ ఎనిమిది మందిని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు అధికారులు. ఇదిలా ఉండగా, తొలిసారిగా బిక్కవోలులో కరోనా కేసులు బయటపడుతుండడంతో‌ ఈ ప్రాంతాన్ని రెడ్‌ జోన్‌లో చేర్చారు అధికారులు.