బెజవాడలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు ఆటంకం కలిగింది. రాష్ట్రంలో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు లేకపోవడంతో ఐదు రోజులుగా రక్షపరీక్షలు నిలిచిపోయాయి. ఇప్పటికే బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నప్పటికీ పరీక్షలు ఇంకా ప్రారంభం కాలేదు. దీనిపై అధికారులు స్పందిస్తూ కిట్లు ఎప్పుడు వస్తాయో చెప్పలేమని అంటున్నారు.

మరోవైపు పరీక్షలు ఆలస్యం కావడంతో తమ ఆరోగ్యం పట్ల కరోనా అనుమానితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని గ్రీన్, ఆరెంజ్ జోన్లతో పాటు రెడ్ జోన్లలోనూ పరీక్షలు నిలిచిపోవడం గమనార్హం. కిట్లు లేకపోవడంతో ఇంటి దగ్గరే పరీక్షలు నిర్వహిస్తామన్న అధికారులు ఇప్పుడు  ఏ మాత్రం పట్టించుకవోడం లేదు.

ఈ క్రమంలో అనుమానం ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు స్పష్టం చేశారు. కాగా గత 24 గంటల్లో కొత్తగా 54 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1887కు చేరుకుంది.

గత 24 గంటల్లో 7,320 శాంపిల్స్ ను పరిశీలించగా 54 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకు ఆస్పత్రుల నుంచి 842 మంది డిశ్చార్జీ కాగా, 41 మంది మరణించారు. దీంతో ప్రస్తుతం 1004 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

గత 24 గంటల్లో అనూహ్యంగా అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రొజులోనే 16 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నం జిల్లాలో 11 కేసులు కొత్తగా నమోదయ్యాయి. గుంటూరు, కర్నూలు, కడప జిల్లాల్లో కాస్తా అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది.

గత 24 గంటల్లో కర్నూలు జిల్లాలో 7,  కృష్ణా జిల్లాలో ఆరు, గుంటూరు జిల్లాలో 1 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో మరో కేసు నమోదైంది.

అయినప్పటికీ 547 కేసులతో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుంటూరు జిల్లా 374 కేసులతో రెండో స్థానంలో ఉంది. కృష్ణా జిల్లాలో 322 కేసులు నమోదయ్యాయి. దాంతో కృష్ణా జిల్లా మూడో స్థానంలో కొనసాగుతోంది.