ఏపీలోని విద్యాసంస్థల్లో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే పల్లు జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్ధులు, ఉపాధ్యాయులకు పాజిటివ్ రావడంతో పేరెంట్స్‌ భయాందోళనలకు గురవుతున్నారు.

ఓ వైపు సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేయగా.. తెలంగాణ విద్యా శాఖ సైతం అదే నిర్ణయం తీసుకుంది. ఏపీలో మాత్రం మొండిగా తరగతులు నిర్వహిస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ.. తరగతులు, పరీక్షలు తల్లిదండ్రులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

ఇప్పటికే కరోనాతో పలువురు  టీచర్లు మృత్యువాత పడ్డారు. అయితే ఇప్పటికీ ఇబ్బంది లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు ఉంటాయని మంత్రి సురేశ్ చెప్పారు. 

Also Read:కరోనా విశ్వరూపం: ఆంధ్రప్రదేశ్ లో రాత్రి కర్ఫ్యూ?

రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్‌ బారినపడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌లో మొదటిసారి ఆంధ్రప్రదేశ్‌లో 6 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. అంతేకాకుండా ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతుండటం తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తోంది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,962 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఏకంగా 6,096 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,48,231 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.