కరోనా కన్ప్యూజన్... 14రోజుల్లో కాదు 28 రోజుల్లో కూడా: జవహర్ రెడ్డి
కరోనా వైరస్ నివారణకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి వైద్యారోగ్య శాఖ కార్యదర్శి జవహర్ రెడ్డి వివరించారు.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి, నివారణకు చేపడుతున్న చర్యల గురించి ఏపి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు కరోనా లక్షణాలు బయటపడేందుకు కేవలం 14 రోజుల సమయం పడుతుందనుకుంటే కొన్ని కేసుల్లో 14నుండి 28 రోజుల మధ్యలో కూడా బయటపడుతున్నాయని తెలిపారు. కాబట్టి కరోనా కేసులపై ఇంకా స్పష్టత రాలేదన్నారు.
ప్రస్తుతం రాష్ట్రం లో 181 క్లస్టర్ లు ఉన్నాయని... 121 అర్బన్, 60 గ్రామీణ ప్రాంతాల్లో వున్నాయన్నారు. ఈ 181 క్లస్టర్లు రాష్ట్రంలోని 103 మండలాల్లో విస్తరించి వున్నాయన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 56 రెడ్, 47 ఆరెంజ్, 573 మండలాలు గ్రీన్ జోన్ లో వున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో అత్యధిక కేసులు కేవలం నాలుగు జిల్లాలోనే ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో కరోనా టెస్టింగ్ కెపాసిటీని గణనీయంగా పెంచామని జవహర్ రెడ్డి వెల్లడించారు. ఈరోజు(గురువారం) వరకు 48 వేల కోవిడ్ పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 9 ల్యాబ్స్ కరోనా పరీక్షల కోసం పని చేస్తున్నాయన్నారు. మొత్తం రోజుకు 6980 యాంటీ జెన్ టెస్ట్ లు చేసే సామర్ధ్యం ఉందన్నారు. ప్రతి పది లక్షల మందికి 961 పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు.
కర్నూల్ ఆసుపత్రిని కూడా కొవిడ్ ఆసుపత్రిగా మారుస్తున్నట్లు జవహర్ రెడ్డి ప్రకటించారు. పేషంట్ మేనేజ్మెంట్ కు ప్రత్యేక అప్లికేషన్ పెట్టామని... ప్రతి హాస్పిటల్ నుండి కంట్రోల్ రూంకి వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశామన్నారు.టెలి మెడిసిన్ లో ఇప్పటికి 306 మంది డాక్టర్ లు వాలెంట్రీగా సేవ చేస్తున్నారని... 4000 పైగా కన్సల్టేషన్ లు జరిపామన్నారు. కొత్తగా సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చామని ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో పిపిఈ లు 3 లక్షల పైగా ఉన్నాయని...1.4 లక్షల N95 మాస్కులు అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి మూడు మాస్కుల పంపిణీ చేస్తున్నామన్నారు. ఆక్సిజన్ సప్లై పైన దృష్టి పెట్టామని... ఆక్సిజన్ సప్లై లైన్ లు కొత్తగా వేస్తున్నామన్నారు.
ర్యాపిడ్ కిట్స్ వినియోగంపై నిన్న(బుధవారం) సాయంత్రం ఐసిఎంఆర్ నుండి పెర్మిషన్ వచ్చిందన్నారు. ర్యాపిడ్ టెస్ట్ లో పాజిటివ్ వస్తే ఆర్సీపీటీఆర్ ద్వారా ఫైనల్ నిర్ధారణ చేస్తున్నామన్నారు. ర్యాపిడ్ టెస్ట్ కేవలం కమ్యూనిటీ టెస్టింగ్ కోసమేనని..పూర్తిగా ర్యాపిడ్ కిట్స్ పైనే డిపెండ్ అయ్యి లేమన్నారు. ప్లాస్మా ట్రీట్మెంట్ కోసం ఇంకా అనుమతులు రాలేదని తెలిపారు జవహర్ రెడ్డి.