అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 2 వేల మార్కు దాటింది. గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటలో ఏపీలో కొత్తగా  36 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2100కు చేరుకుంది. 

తాజాగా మరో మరణం సంభవించింది. దీంతో మొత్తం రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య 48కి చేరుకుంది. ఇప్పటి వరకు 1192 మంది చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 860 ఉంది. 

గత 24 గంటల్లో నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 15 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 9 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 5 కేసులు రికార్డయ్యాయి. కడప, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో రెండేసి కేసులు నమోదు కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క కేసు నమోదైంది. అనంతపురం, తూర్పు గోదావరి, కర్నూలు, ప్రకాశం విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 

కర్నూలు జిల్లాలో గత 24 గంటల్లో ఒక్క కేసు కూడా నమోదు కానప్పటికీ 591 కేసులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుంటూరు జిల్లా 404 కేసులతో రెండో స్థానంలో కొనసాగుతోంది. కృష్ణా జిల్లా 351 కేసులతో మూడో స్థానంలో కొనసాగుతోంది. 

కరోనా వైరస్ తో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 18 మరణాలు సంభవించాయి. కృష్ణా జిల్లాలో 14 మంది, గుంటూరు జిల్లాలో 8 మంది మరణించారు. అనంతపురం జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నం జిల్లాలో ఒక్కరు మరణించారు. 

జిల్లాలవారీగా కరోనా మరణాల సంఖ్య ఇలా ఉంది...

అనంతపురం 118
చిత్తూరు 151
తూర్పు గోదావరి 51
గుంటూరు 404
కడప 99
కృష్ణా 351
కర్నూలు 591
నెల్లూరు 126
ప్రకాశం 63
శ్రీకాకుళం 7
విశాఖపట్నం 66
విజయనగరం 4
పశ్చిమ గోదావరి 69