అమరావతి: కరోనా వైరస్‌ కారణంగా రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు కొనసాగుతున్నందున ఆదాయం కోల్పోయిన వివిధ మతాల పెద్దలకు జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వీరిలో ప్రధానంగా అర్చకులు, ఇమాంలు, పాస్టర్లకు రూ 5 వేల చొప్పున సాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించింది.

అయితే ధార్మిక, మత సంస్థల నుంచి గౌరవ భత్యం, వేతనాలు అందుకుంటోన్న అర్చకులు, ఇమాంలు, పాస్టర్లకు ఈ సాయం అందదని తెలిపారు. అర్చకులు, ఇమాములు, పాస్టర్లుగా పని చేస్తూ సంస్థల నుంచి గౌరవ వేతనాలను పొందని వారికి మాత్రమే ఈ ప్రభుత్వ సాయం అందుతుందని అన్నారు. 

కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆలయాల్లో భక్తుల దర్శనాల నిలిపివేతతో ఆదాయం కోల్పోయిన అర్చకులను ఆదుకునేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆదేశాలతో చిన్న ఆలయాల్లో పనిచేసే అర్చకులకు రూ. 5,000లు గ్రాంట్‌ రూపంలో చెల్లించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి  వెలంపల్లి శ్రీనివాసరావు ఇదివరకే వెల్లడించారు. 

దేవదాయ శాఖ నుంచి ఎలాంటి నెలవారీ జీతాలు పొందని, ధూప దీప నైవేద్యం వంటి పథకాల ద్వారా లబ్ధి పొందని వారికి అర్చక సంక్షేమ నిధి నుంచి ఈ సాయాన్ని చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ నిర్ణయం వల్ల 2,500 మంది అర్చకులకు లబ్ధి చేకూరనుంది. 

లాక్‌డౌన్‌ కారణంగా దేవాలయాలలోకి భక్తులను అనుమతించడం లేదు. ప్రస్తుతం అర్చకులు మాత్రమే ఏకాంతంగా నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో చిన్న దేవాలయాలలో ఎలాంటి ఆదాయ వనరులు లేని కారణంగా అర్చకుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. 

ధూప దీప నైవేద్యం, అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌ ద్వారా 2,800 మందికి పైగా అర్చకులకు ప్రతి నెలా ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుతుంది. ఈ రెండు పథకాలూ వర్తించని వారు రాష్ట్ర వ్యాప్తంగా 2,500 మంది దాకా పలు ఆలయాల్లో పనిచేస్తున్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌ ద్వారా ఒక్కొక్కరికి రూ. 5000 గ్రాంటు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ నిర్ణయం కారణంగా అర్చక సంక్షేమ నిధిపై సుమారు ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల భారం పడనుంది.

కరోనా విపత్కర పరిస్థితుల్లో అర్చకులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఆంధ్రప్రదేశ్‌ అర్చక సమాఖ్య సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లగానే సానుకూలంగా స్పందించారు. అర్చకులకు ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు ప్రకటించినందుకు అర్చక సమాఖ్య తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.