లాక్‌డౌన్ పొడిగింపును సమర్ధిస్తున్నా: చంద్రబాబు
హైదరాబాద్:లాక్‌డౌన్ పొడిగింపును తాను సమర్ధిస్తున్నట్టుగా చంద్రబాబు చెప్పారు.లాక్ డౌన్ తో కరోనాను కొంత మేరకు కట్టడి చేయగలిగినట్టుగా ఆయన అభిప్రాయపడ్డారు.
మంగళవారంనాడు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.కరోనాపై పోరాటం సాగించాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా కారణంగా అగ్రరాజ్యాలు కూడ అతలాకుతలమైన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా కూడ కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాలు కరోనాను సమర్ధవంతంగా అరికడుతున్నట్టుగా ఆయన చెప్పారు.
Also read:ఏపీలో మరో 34 కరోనా కేసులు: మొత్తం 473కి చేరిక
కరోనా ఆర్థిక వ్యవస్థకు సవాల్ గా మారిందన్నారు. ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని బాబు ప్రజలను కోరారు.కరోనాపై అందరూ పోరాడాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. టెస్టింగ్ కేంద్రాలను పెంచాలని ఆయన సూచించారు.
ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించాలని ఆయన సూచించారు. కరోనా, నాన్ కరోనా పేషేంట్లను గుర్తించాల్సిందిగా కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు కేవలం ఏడు ల్యాబ్ లు మాత్రమే ఉన్న విషయాన్ని బాబు గుర్తు చేశారు.
అధికారంలో ఉన్న వారు ఇష్టారాజ్యంగా ప్రవర్తించకూడదని చంద్రబాబు పరోక్షంగా సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. కరోనా విషయమై టీడీపీ తరపున ఓ ఫోరం ఏర్పాటు చేసిన విషయాన్ని బాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ఫోరంలో పలువురు మేధావులు, నిపుణులు ఉన్నారన్నారు.
కరోనా వైరస్ విషయమై ఈ ఫోరంలో చర్చించామన్నారు. ఈ ఫోరం సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఈ నెల 10వ తేదీన ప్రధాని మోడీకి లేఖ రాసినట్టుగా ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరికి టెస్టులు నిర్వహించి కేసులను బట్టి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ఏర్పాటు చేయాలని తాను ప్రధానికి ఆ లేఖలో సూచించినట్టుగా బాబు తెలిపారు.
ఇవాళ ఉదయం ప్రధాని మోడీ తనతో మాట్లాడినట్టుగా చంద్రబాబు చెప్పారు. దేశంలో ప్రతి ఒక్కరికీ టెస్టులు పెంచాల్సిన అవసరంపై మోడీతో చెప్పినట్టుగా చెప్పారు.