విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా టెస్టుల సామర్ధ్యాన్ని పెంచుతున్నట్లు ఆరోగ్యశ్రీ సీఈవో మల్లిఖార్జున్ వెల్లడించారు. ఇప్పటికే దేశం సగటు కంటే రాష్ట్రంలోనే అధికంగా కరోనా టెస్టులు చేస్తున్నట్లు... రేపటి నుంచి రాష్ట్రంలో 6650 టెస్టులు చేసే సామర్ధ్యం వస్తుందన్నారు. 

ట్రూనాట్ మెషీన్ల ద్వారా 4 వేలు, వీఆర్డీఎల్ ద్వారా 2400 టెస్టులు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 9 వీఆర్డీఎల్ ల్యాబ్ లు ఏర్పాటు చేసినట్లు... ఇవి అందుబాటులోకి వస్తుండటంతో మరో 2400 మందికి పరీక్షలు చేసే సామర్ధ్యం పెరిగిందన్నారు. ట్రూనాట్ ల్యాబ్ లను 42 ఏర్పాటు చేసినట్లు... ల్యాబ్ ల ద్వారా 4వేల టెస్టులు చేసే సామర్ధ్యం వుందన్నారు. 

ఈనెల 21నాటికి ర్యాపిడ్ కిట్లను కూడా రప్పిస్తున్నట్లు తెలిపారు. ఇవి అందుబాటులోకి వస్తే రోజుకి 26వేలకుపైగా పరీక్షలు చేసే స్థాయికి రాష్ట్రం చేరుకుంటుందని ఆరోగ్యశ్రీ సీఈవో వెల్లడించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. తాజాగా ఏపీలో 19 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 502కు పెరిగింది. ఏపీలో ఇప్పటి వరకు కోవిడ్ -19 వల్ల 11 మంది మరణించారు. 

కొత్తగా పశ్చిమ గోదావరి జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 6, గుంటూరు జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి.కృష్ణా జిల్లాలో ఒక కేసు నమోదైంది. ఇప్పటి వరకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది 16 మంది డిశ్చార్జీ అయ్యారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 118 కేసులు నమోదయ్యాయి. 97 కేసులతో కర్నూలు రెండో స్థానాన్ని ఆక్రమించింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కరోనా వైరస్ ఉచ్చులో పడలేదు.