కరోనా వైరస్ దేశంలో తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రతిరోజూ దాదాపు 50వేల కేసులు నమోదౌతున్నాయి. ఎటునుంచి ఎవరికి కరోనా సోకుతుందో కూడా అర్థం కావడం లేదు. తాజాగా.. ఓ కొత్త పెళ్లి కొడుకుకి కరోనా పాజిటివ్ రాగా.. భార్య కోసం పరితపించిపోయాడు. ఈ క్రమంలోనే ఐసోలేషన్ కేంద్రం నుంచి భార్య కోసం పరారయ్యాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రకాశం జిల్లా తర్లుపాడుకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల వివాహమైంది. అతనికి కరోనా పాజిటివ్‌ రావడంతో... మార్కాపురంలోని కొవిడ్‌ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గురువారం ఉదయం ఆస్పత్రి నుంచి బయటకెళ్లి ఎంతసేపటికీ తిరిగి రాలేదు. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా బాధితుడి పరారీపై మార్కాపురం గ్రామీణం, తర్లుపాడు పోలీసులకు సమాచారమిచ్చారు.

కరోనా బాధితుడికి ఇటీవల వివాహం కావడంతో... భార్య, బంధువులు గుర్తొచ్చి ఇంటికి వెళ్లిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా.. అతని కోసం వెతికి మరీ పోలీసులు పట్టుకొచ్చారు.  సాయంత్రానికి తిరిగి మార్కాపురం కొవిడ్‌ వైద్యశాలకు తరలించారు. కాగా ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.