ఇక చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితం: మంత్రి పెద్దిరెడ్డి

కరోనా మహమ్మారిని రాష్ట్రం నుండి తరిమేందుకు ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. 

corona outbreak... Peddireddi Ramachandra Reddy fires chandrababu naidu

అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇక హైదరాబాద్ కే పరిమితమని... ఆయనకు ఏపి రాష్ట్ర రాజకీయాల్లో స్థానం లేదని ఎద్దేవా చేశారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భగనుల  శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటుగా టిడిపికి 23 ఎమ్మెల్యే, 3 ఎంపి స్థానాలు వచ్చాయన్నారు.  ప్రజా విశ్వాసంను కోల్పోయిన చంద్రబాబు పార్టీకి ఇకపై అవికూడా రావని... రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగవ్వనుందన్నారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యాడని పెద్దిరెడ్డి అన్నారు.   

''ఏపిలో కరోనా వ్యాపిస్తుంటే హైదరాబాద్ లోని ఇంటిలో కూర్చుని బయటకు రాకుండా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. కరోనా కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా? ప్రజలకు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు జవాబు చెప్పుకోవాలి.  ఒకవైపు ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న పనులకు ప్రజలు మద్దతు పలుకుతున్నారు. కానీ రాష్ట్రప్రభుత్వం చేసే ప్రతి పనిని చంద్రబాబు బూతద్దంలో తప్పుగా చూస్తు విమర్శలు చేస్తున్నాడు'' అని అన్నారు.

''ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే విధంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతున్నాడు.  చంద్రబాబు అబద్దపు మాటలు నమ్మె పరిస్థితిలో ప్రజలు లేరు. ప్రతిపక్ష నేతగా కరోనా సమయంలో ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వాలి. కానీ దానికి భిన్నంగా చంద్రబాబు ప్రతిదానిని రాజకీయం చేస్తున్నాడు.  ఇకనైనా ఆయన తన వైఖరిని మార్చుకోవాలి'' అని సూచించారు.  

''రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యల వల్ల కోవిడ్ నియంత్రణలో మంచి ఫలితాలు వస్తున్నాయి.  కోవిడ్ నేపథ్యంలో కేవలం నాలుగు వారాల్లో తొమ్మిది ల్యాబ్ లను ఏర్పాటు చేశాం. దేశంలో సగటు పరీక్షల కన్నా మూడు రెట్లు అంటే రోజుకు 961 టెస్ట్ లు చేస్తున్నాం.  కోవిడ్ అనుమానిత వైద్య పరీక్షలు చేయడంలో దేశంలోనే మనం ప్రథమ స్థానంలో వున్నాం.  ప్రతి జిల్లాలోనూ కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేశాం'' అని మంత్రి  వివరించారు.  

''రాష్ట్రంలో 7900 మంది క్వారంటైన్ లో వున్నారు. వారికి అన్ని వసతులు అందుబాటులో వుంచాం.  దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ప్రజల ఆరోగ్యం కోసం సీఎం జగన్ టెలిమెడిసిన్ ను ప్రారంభించారు.  ఆయన పట్టుదలతో ప్రారంభించిన టెలిమెడిసిన్ లో 300 మంది వైద్యులు పనిచేస్తున్నారు. 14400 నెంబర్ కు మిస్ట్ కాల్ చేస్తే చాలు వైద్యులు వైద్య సహాయం కోసం అందుబాటులోకి వస్తారు'' అని తెలిపారు. 

''ఈనెల 23వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 48,034 మందికి కోవిడ్ పరీక్షలు చేశాం.  ముఖ్యమంత్రి ముందుచూపుతో ఇతర దేశాల నుంచి ర్యాపిడ్ కిట్ లను తీసుకువచ్చి పరీక్షలు చేయిస్తున్నారు.  చివరికి దీనిపైన కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు అవాకులు, చెవాకులు మాట్లాడాడు.  ఐసిఎంఆర్ అనుమతితో జరుగుతున్న పరీక్షలపైన కూడా విమర్శలు చేయడం దారుణం. రాష్ట్ర ప్రజలకు వరప్రదాయినిగా ర్యాపిడ్ టెస్ట్ లతో కోవిడ్ ను ఈ ప్రభుత్వం ఎదుర్కొంటోంది.     చంద్రబాబు కేవలం రాజకీయ దురుద్దేశంతో విమర్శలు చేస్తున్నాడు'' అని పెద్దిరెడ్డి మండిపడ్డారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios