Asianet News TeluguAsianet News Telugu

ఏపీకి కేంద్ర బృందం... మద్యం షాపుల నిర్వహణపై సమీక్ష

 కరోనా విజృభణ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర బృందం ఇవాళ్టి నుండి ఏపిలో పర్యటించనుంది. 

 

 

corona outbreak... central team visits in AP
Author
Amaravathi, First Published May 5, 2020, 11:33 AM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక కరోనా కేసులను కలిగిన రాష్ట్రంగా ఏపి నిలించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపి సర్కార్  లాక్ డౌన్ ను సడలించడంతో కరోనా మరింత విజృంభించే అవకాశాలున్నాయని ప్రతిపక్షాలు, కొందరు ప్రజలు కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని పరిస్థితుల గురించి తెలుసుకోడానికి ఓ బృందాన్ని కేంద్రం ఏపికి పంపించింది. 

కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ, హోం శాఖ అధికారులతో కూడిన బృందం ఇవాళ(మంగళవారం), రేపు(బుధవారం) ఏపిలో పర్యటించనుంది.  ముఖ్యంగా  రాష్ట్రంలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న కర్నూల్, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పరిస్థితులను ఈ బృందం అధ్యయనం  చేయనుంది. 

మూడు జిల్లాల్లో కరోనా వ్యాప్తి,  నివారణ చర్యలపై రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో ఉన్నతస్తాయిలో సమీక్ష చేయనుంది ఈ బృందం. క్షేత్రస్థాయిలో లాక్ డౌన్ అమలు, సడలింపులు, మద్యంషాపుల నిర్వహణ, భౌతికదూరం అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కర్నూల్, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే అత్యధిక కేసులు నమోదవడం... వైరస్ వ్యాప్తి అదుపులోకి రాకపోవడానికి గల కారణాలపై ఆరా తీయనున్నారు. 

ఇతర రాష్ట్రాలో చిక్కుకున్న వలస కూలీలు, యాత్రికులు, విద్యార్థులకు మాత్రమే రాష్ట్రంలోకి అనుమతివ్వాలని ఏపి ప్రభుత్వం నిర్ణయించింది. వ్యక్తిగతంగా వచ్చేవారికి ఎట్టిపరిస్థితుల్లో అనుమతి వుండదన్నారు. 

కరోనాతో ఇబ్బందిపడుతున్న వారిలో 50శాతం రికవరీ వుందని...చిత్తూరు, ప్రకాశం,నెల్లూరు, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మెరుగైన రికవరీ వుందని అధికారులు తెలిపారు. ఏపీలో ప్రతి 76 పరీక్షల్లో ఒకరికి పాజిటివ్ వస్తోందని వెల్లడించారు. 

 
 

Follow Us:
Download App:
  • android
  • ios