కరోనా వైరస్ కారణంగా దేశంలోని ప్రజలంతా నాలుగు గోడల మధ్య బందీ అయిపోయారు. జీవితంలో ఎప్పుడూ చూడని ఇలాంటి పరిస్ధితుల్లో నిత్యావసరాలు, ఇతర వాటి కోసం సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.

లాక్‌డౌన్ కారణంగా కొన్ని అత్యవసరాలకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. ఈ క్రమంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వంట గ్యాస్ సరఫరా సంస్థలు సిలిండర్ల డెలివరీ పద్ధతుల్లోనూ మార్పులు చేసింది.

Also Read:కరోనా: ఇండియాలో 24 గంటల్లో 1,334 కేసులు, మొత్తం 15,712కి చేరిక

డోర్ డెలివరీకి బదులు గేట్ డెలివరీ చేయనున్నాయి. గ్యాస్‌ను సరఫరా చేసే డెలివరీ బాయ్స్ నేరుగా ఇళ్లలోకి వెళ్లి సిలిండర్ ఇవ్వడం ప్రస్తుత పరిస్ధితుల్లో ప్రమాదకరంగా మారినందున.. గేట్ డెలివరీగా మార్చినట్లు తెలుగు రాష్ట్రాల వంట గ్యాస్ డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.

అలాగే గ్యాస్ డెలివరీ బాయ్స్ సైతం శానిటైజ్డ్ గ్లౌజులు, మాస్కులు ధరించి, ఇళ్లలోకి సిలిండర్లు తీసుకెళ్లకుండా బయటే ఇచ్చేలా మార్గదర్శకాలు విడుదలయ్యాయి. దీనిలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆయిల్, గ్యాస్ కంపెనీల ప్రతినిధులకు ఈ ఆదేశాలు జారీ చేసింది.

Also Read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: వైద్యం అందక ముంబైలో లాయర్ మృతి

ఇప్పుడు ఇదే బాటలో తెలంగాణ ప్రభుత్వం నడవనుంది. కాగా గత 24 గంటల్లో దేశంలో 1,334 కరోనా కేసులు నమోదైనట్లుగా కేంద్రం ప్రకటించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 15,712కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఆదివారం వెల్లడించారు.