అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండిపోతున్నాయి. అంతేవేడిగా మారుతున్నాయి రాజకీయాలు. అయితే ఆ రాజకీయ వేడి రాజకీయ నేతల మధ్య అనుకుంటే పొరబడినట్లేనండోయ్. 

ఆ రాజకీయ వేడి హేతువాదులు, జ్యోతిష్యుల మధ్య నెలకొంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కొందరు జ్యోతిష్యులు జోస్యం చెప్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని మరికొందరు జ్యోతిష్యులు స్పష్టం చేస్తున్నారు. 

ఏ పార్టీకి అనుబంధంగా ఉన్న జ్యోతిష్యులు ఆయా ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి ఏ సమయం అనుకూలమైనదో కూడా కాలచక్రం గీసి మరీ చెప్తున్నారు. అంతటితో ఆగిపోవడం లేదు ఏ పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయో కూడా చెప్పేస్తున్నారు. 

జ్యోతిష్యుల తీరుపై హేతువాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పాలంటూ హేతువాదులు సవాల్ విసిరుతున్నారు. ఎన్ని సీట్లు వస్తాయో కచ్చితంగా చెప్తే తాను రూ.5 లక్షలు నజరానా ఇస్తానని ఏపీ హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నార్ని వెంకట సుబ్బయ్య ప్రకటించారు.

దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలని జ్యోతిష్యులను కోరారు. ఇప్పటి వరకు ఆ గ్రహాలు అనుకూలం ఇవి కలిసి వస్తాయంటూ లెక్కలు వేసి మరీ చెప్పిన జ్యోతిష్యులు హేతువాది వెంకట సుబ్బయ్య సవాల్ ను స్వీకరిస్తారో లేదో అన్నది వేచి చూడాలి.