సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ముందుగా కనపడేవి.. వినపడేవి కోడి పందేలే. అసలు సంక్రాంతి సందడంతా అక్కడే మొదలౌతుంది. పట్టణాల్లో ఈ సంస్కృతి కనిపించకపోయినా.. పల్లెల్లో మాత్రం స్పష్టంగా కనపడుతుంది. అందుకే... చాలా మంది పండగకు పల్లెటూర్లకు పయనమౌతారు.

ఇక అసలు మ్యాటర్లోకి వెళితే... మరో పది రోజుల్లో సంక్రాంతి సంబరాలు మొదలుకానున్న నేపథ్యంలో... ఇప్పటి నుంచే కోడిపందేలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. పందేలు దగ్గరపడుతుండటంతో... కోడి పుంజులకు కూడా బాగా డిమాండ్ పెరిగింది. 

కైకలూరు ప్రాంతంలో ఆక్వా పరిశ్రమ విస్తరించి ఉండటంతో చేపల చెరువు గట్లుపై పందెపు కోడిపుంజులను పెంచడాన్ని కొందరు హాబీగా పెట్టుకున్నారు. ఏడాదిగా వివిధ జాతులకు చెందిన కోడిపుంజులను అత్యంత ఖరీదైన ఆహారాన్ని అందించి పెంచుతున్నారు. కొన్ని జాతుల పుంజులు ఒక్కోటి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు ధర పలుకుతుంది. సంక్రాంతి సమీపిస్తుండటంతో పందేల కోసం వీటి పోషణలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వీటి ధర అంతాల పలకడంలో మనం ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే...వాటికి పెట్టి పోషించిన ఆహారం కూడా అదే రీతిలో ఉంది.  ఉదయం 6గంటలకు పుంజులను నీటిలో ఈత కొట్టిస్తూ వ్యాయామం చేయిస్తారు. తర్వాత 7గంటలకు ఒక్కో పుంజుకు 10బాదం పప్పులు, నల్లద్రాక్ష, వెండి ఖర్జూరం, తాటి బెల్లం, నల్ల నువ్వులు కలిపి లడ్డూలా చేసి గంటకి ఒకటి చొప్పున పెడతారు.

మధ్యాహ్నం 50గ్రాముల మటన్,జీడిపప్పు కలిపిన ఆహారాన్ని పెడతారు. సాయంత్రం సోళ్లు, సజ్జలు, వడ్లు, గుడ్లు పెడతారు. ఇంకొందరైతే వైన్ కూడా తాగిస్తుండటం విశేషం. ఈ ఆహారం అరగడానికి వాటిని మందులు కూడా వేస్తుంటారట. ఈ ఫుడ్ పెట్టడానికి ఒక్కో పుంజుకి రోజుకి రూ.200 ఖర్చు చేస్తున్నారట. ఈ విధంగా కొన్ని నెలల నుంచి మేపి.. ఆ తర్వాత మంచి గిరాకీకి అమ్మేస్తున్నారు.