కరోనా భయం వెంటాడుతున్నా.. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు ఆగడం లేదు. ముఖ్యంగా కోడిపందెలకు పెట్టింది పేరైన ఉభయగోదావరి జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో కోడిపందేలు ఊపందుకున్నాయి.

నిబంధనలను పాటించడంతో పాటు ప్రజలకు చెప్పాల్సిన ప్రతినిధులే దగ్గరుండి కోడి పందాల‌కు శ్రీకారం చుట్టారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కోడి పందాలు ప్రారంభించారు.

పశ్చిమగోదావరి జిల్లా సీసలిలో టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు కోడి పందాలు ప్రారంభించారు. కోడిపందెలు ఈ ఏడాది జరగవేమోనన్న భయందో వున్న పందెం రాయుళ్లు ఈ విషయం తెలుసుకుని బరుల దగ్గరకు ప‌రుగులు పెడుతున్నారు.

ఎన్ని ఆంక్ష‌లున్నా కోడి పందాలు జరుగుతాయని ముందు నుంచి ధీమాగా ఉన్న పందెం నిర్వాహకులు అందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఉభ‌య గోదావ‌రి జిల్లాలో కొన్ని చోట్ల కోడి పందాలు మొదలవ్వగా మరికొన్ని చోట్ల పందాలు ప్రారంభించేందుకు సిద్ధం చేసుకుంటున్నారు నిర్వహకులు.

ఇప్పటికే పెద్ద ఎత్తున కోడి పందాల కోసం పందెం రాయుళ్లు కోళ్లను సిద్ధం చేశారు. మామూలు కోళ్ల పందాలతో కిక్ ఏముంటుందంటూ కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి పందాలు నిర్వహిస్తుంటారు. ఈ పందాల‌లో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.