ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంబేడ్కర్ కొనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని వరద బాధితులను సీఎం జగన్ పరామర్శిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంబేడ్కర్ కొనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని వరద బాధితులను సీఎం జగన్ పరామర్శిస్తున్నారు. ఇందుకోసం ఈ రోజు ఉదయం సీఎం జగన్ కోనసీమ జిల్లాకు చేరుకున్నారు. జిల్లాలోని పి గన్నవరం మండలం జి పెద్దపూడికి చేరుకున్న సీఎం జగన్.. వరద బాధితులతో మాట్లాడారు. జి పెద్దపూడి ఫెర్రి నుంచి పంటుపై లంక గ్రామాలకు చేరుకుని వరద ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ట్రాక్టర్‌పై ప్రయాణిస్తూ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సాగిస్తున్నారు. పెదపూడిలంకలో సీఎం జగన్ వరద బాధితులతో మాట్లాడారు.
అయితే సీఎం జగన్ జి పెద్దపూడికి చేరుకునే సరికి అక్కడ వర్షం కురుస్తోంది. అయతే సీఎం జగన్ వర్షంలోనే గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వరద బాధితులతో మాట్లాడుతూ వారి కష్టాలు అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే వారికి అందుతున్న సాయం గురించి తెలుసుకుంటున్నారు. ఇక, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లంక గ్రామాలను వరద ముంచెత్తిన సంగతి తెలిసిందే.
సీఎం జగన్ పర్యటన.. పుచ్చకాయలవారిపేట, అరిగెలవారిపేట, వూడిముడిలంక, మేకలపాలెంలలో సాగనుంది. అక్కడ వరద బాధితులతో మాట్లాడి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు. రాత్రికి సీఎం జగన్ రాజమహేంద్రవరం చేరుకోనున్నారు. రాజమండ్రి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ గెస్ట్ హౌస్‌లో గోదావరి రీజియన్ అధికారులతో సీఎం జగన్ రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్‌లను సమీక్షిస్తారు. రాత్రి సీఎం జగన్ రాజమహేంద్రవరంలో బస చేస్తారు.
ఇదిలా ఉండగా వరద ప్రభావిత ఆరు జిల్లాల్లో 218 సహాయ శిబిరాలను ప్రారంభించామని ఏపీ సర్కార్ తెలిపింది. ముంపునకు గురైన గ్రామాల నుంచి 1,43,614 మందికి సహాయ శిబిరాల్లో వసతి కల్పించామని చెప్పింది.
