అమరావతి: కరోనా విజృంభణతో యావత్ భారతదేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో ఆక్వా రైతులు మార్కెటింగ్ సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆక్వా రైతులను అండగా వుండేందుకు స్వయంగా ముఖ్యమంత్రి జగనే ముందుకువచ్చారు. 

ఆంధ్ర ప్రదేశ్ నుండి ఆక్వా ఉత్పత్తులు ఎక్కువగా ఎగమతి అయ్యే రాష్ట్రం అసోం. ఇక్కడ ఆక్వా ఉత్పత్తులకు మంచి గిరాకీ వుంటుంది. కాబట్టి ఆ రాష్ట్ర సీఎం  శరబానంద సోనోవాల్‌ కు స్వయంగా ఫోన్ చేసిన సీఎం ఏపీ నుంచి చేపల ఎగుమతికి ఉన్న అడ్డంకుల తొలగింపుపై దృష్టిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ నుంచి పెద్ద ఎత్తున ఆక్వా ఉత్పత్తులు అసోంకే ఎగుమతి అవుతాయని... వాటిని అడ్డుకోవడం వల్ల ఇక్కడి రైతులు ఇబ్బంది పడుతున్న  విషయాన్ని అసోం సీఎంకు తెలియజేశారు సీఎం జగన్‌. 

అసోం సరిహద్దుల్లో లారీలు నిలిచిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని జగన్  కోరారు. అలాగే చేపలు విక్రయించే మార్కెట్లను తెరవాలంటూ అసోం ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు జగన్. జగన్ విజ్ఞప్తులపై తగు చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎంకు అసోం సీఎం సోనోవాల్‌ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఇక లాక్‌డౌన్‌ కారణంగా ఏపీలో చిక్కుకుపోయిన అసోం వాసులకు తగిన సహాయాన్ని అందించాలని అసోం సీఎం జగన్ ను కోరారు. అన్ని రకాలుగా వారికి అండగా  నిలుస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు.