ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఊహించని విధంగా రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం  ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ జగన్ సర్కార్ .. ప్రజల సంక్షేమ కోసం తాపత్రయపడుతోంది. తాజాగా సీఎం జగన్.. డ్వాక్రా మహిళల సంక్షేమం కోసం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెల 24వ తేదీన జీరో వడ్డీ పధకాన్ని పునః ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా పొదుపు సంఘాల మహిళలకు సుమారు రూ. 1,400 కోట్ల మేరకు లబ్ది చేకూరనుంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 647కు చేరిన సంగతి తెలిసిందే.

ఈ పథకం వల్ల..రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని 6.95 లక్షల సంఘాలకు సున్నా వడ్డీ కింద రూ.975 కోట్ల సాయం అందనుండగా.. పట్టణ ప్రాంతాల్లోని 1.83 లక్షల సంఘాలకు రూ.425 కోట్ల చొప్పున జీరో వడ్డీ పధకంతో లబ్ధి చేకూరుతుంది.

 ఇక పధకానికి సంబంధించిన విధివిధానాలు సోమవారం, లేదా మంగళవారం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అటు పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి జీరో వడ్డీ పధకం అమలుకు గానూ రూ.765.19 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.