ఓ దేవాలయం అభివృద్ధికి కోసం రాష్ట్ర ఖజానాను వినియోగించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. కాగా.. ఇప్పటి వరకు ఏ ఆలయానికి ఇలా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా వినియోగించకపోవడం గమనార్హం.  దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో అమ్మవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ సమయంలో  ఆలయ అభివృద్ధి పనులకు రూ.70కోట్లు ఇస్తామంటూ జగన్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆ దిశగా ఇప్పుడు చర్యలు చేపట్టారు. 

దీనిలో భాగంగా శుక్రవారం ఇచ్చిన హామీని నెరవేర్చే క్రమంలో.. రూ.70 కోట్లతో దుర్గ గుడివద్ద చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు చిన్న ఆలయం మొదలు పెద్ద దేవాలయాల వరకు ఏ అభివృద్ధి పనులు చేపట్టాలన్నా సొంత నిధులు (భక్తులిచ్చే కానుకలు)తోనే కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

ఏమాత్రం ఆదాయం లేని ఆలయాలు శిధిలావస్థకు చేరితే జీర్ణోద్ధారణకు దేవదాయ శాఖ సీజీఎఫ్‌ (కామన్‌ గుడ్‌ ఫండ్‌) నిధుల నుంచి ఖర్చు చేస్తున్నారు. అధిక ఆదాయం సమకూరే ఆలయాల నుంచి దేవదాయ శాఖ ఏటా నిర్ణీత మొత్తంలో సేకరించే మొత్తాన్ని సీజీఎఫ్‌గా వ్యవహరిస్తారు. శిధిలావస్థకు చేరిన ఆలయాల పునఃనిర్మాణానికి ఈ నిధులు మంజూరు చేస్తుంది. 

అది కూడా ఇప్పటివరకు గరిష్టంగా రూ.ఐదు కోట్లకు మించి సీజీఎఫ్‌ నిధులు ఒక ఆలయానికి ఇచ్చిన ఉదంతాలు లేవని దేవదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. విజయవాడ కనకదుర్గ ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.70 కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించడం దేవదాయ శాఖ చరిత్రలో అపూర్వ ఘటనగా పేర్కొంటున్నారు