ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా అభినందనలు వెల్లువెత్తున్నాయి. సోమవారం డిసెంబర్‌ 21న జగన్ తన 48వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు, ప్రజలు ముఖ్యమంత్రికి పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

ఈ క్రమంలో ఉప్పూ,నిప్పులా ఉండే టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ట్విట్టర్ వేదికగా ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎం జగన్‌కు బర్త్‌డే విషెస్‌ తెలియజేశారు. 

ఈ మేరకు ట్విటర్‌లో స్పందించిన ఆయన.. ‘వైఎస్‌ జగన్‌ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను’. అని ట్వీట్‌ చేశారు. 

అంతకుముందు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కు టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, నిరంతరం ప్రజా సేవలో జీవించాలని ఆశిస్తున్నాను’. అని ట్వీటర్‌ వేదికగా పేర్కొన్నారు. 

అదే విధంగా టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు సీఎం జగన్‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ‘గౌరవనీయులు సీఎం వైఎస్‌ జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ విజన్‌, కృషి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని ఆశిస్తున్నాను. ఆరోగ్యంగా, ఆనందంగా జీవించండి.’ అని ట్వీట్‌ చేశారు.