తాడేపల్లి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసిపి శ్రేణులు ప్రజాసేవకు పూనుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో రక్తం యూనిట్ల కొరతను తీర్చేందుకు పార్టీ శ్రేణులు, అభిమానుల రక్తదానం చేస్తున్నారు. ఈ మేరకు ప్రతి జిల్లాలో రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేశారు. కేవలం ఏపీలోనే కాకుండాచుట్టుపక్కల రాష్ట్రాల్లోని హైదరాబాద్, చెన్నై, పూణే, బెంగుళూరుల్లోనూ రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేశారు.  

ఇక ఏపీలోని 175 నియోజకవర్గాల్లో రక్తదానం చేస్తున్న వారి సంఖ్యను  వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ సభ్యులు పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఒకేసారి 10,500 యూనిట్స్ రక్తదానం రికార్డ్ కాగా ఆ రికార్డ్ అధిగమించే అవకాశం ఉందని వైసిపి శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఈ రక్తదాన కార్యక్రమమాన్ని వైసిపి ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, స్కిల్ డెవెలెప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్ రెడ్డిలు పర్యవేక్షిస్తున్నారు.

మరోవైపు వైసిపి ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదినం రోజున తల్లిదండ్రులను కోల్పోయిన ఒక చిన్నారి జీవితంలో  వెలుగులు నింపారు ఈ జబర్దస్త్ ఎమ్మెల్యే. 
 
పి. పుష్పకుమారి అనే ఒక విద్యార్థిని చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయింది. డాక్టర్ అవ్వాలనే తన కలను మాత్రం కోల్పోని ఆ  అండగా నిలిచి, ఆ చిన్నారి చదువుకయ్యే పూర్తి ఖర్చును భరించడానికి ఎమ్మెల్యే రోజా ముందుకు వచ్చారు. 

పిల్లలందరూ చదువుకోవాలి, అందులోనా ముఖ్యంగా ఆడపిల్లలు చదవాలి అనే ముఖ్యమంత్రి జగన్ పిల్లలందరికీ మేనమామగా మారారని, అందుకోసమని ఈ మంచి పనిని చేయడానికి  జన్మదినం నాడే శ్రీకారం చుడుతున్నట్టుగా చెప్పుకొచ్చారు రోజా. 

"మనకు నచ్చిన వారి పుట్టిన రోజున కేవలం బొకేలు ఇవ్వకుండా ఒక బంగారు తల్లి భవిష్యత్తుకి బాట వెయ్యడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది విద్యకు పెద్ద పీట వేస్తూ ఎంతోమంది చిన్నారులకు మేనమామగా మారిన మన జగనన్నకు ఇదే నా పుట్టినరోజు బహుమతి.. హ్యాపీ బర్త్ డే జగనన్న !!"  అంటూ తాను తీసుకున్న నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా అందరితో  పంచుకున్నారు ఎమ్మెల్యే రోజా.