తెలుగుదేశం పార్టీ మూసేయడానికి సిద్దంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శించారు. దుకాణం మూసేయడానికి సిద్దంగా ఉండటంతో.. పక్క రాష్ట్రాల నుంచి మేనిఫెస్టోలను తీసుకొచ్చి మిక్స్ చేసి వండి పులిహోర కార్యక్రమం చేస్తున్నారని విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ మూసేయడానికి సిద్దంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శించారు. దుకాణం మూసేయడానికి సిద్దంగా ఉండటంతో.. పక్క రాష్ట్రాల నుంచి మేనిఫెస్టోలను తీసుకొచ్చి మిక్స్ చేసి వండి పులిహోర కార్యక్రమం చేస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ సోమవారం పల్నాడు జిల్లా క్రోసూర్‌లో జగనన్న విద్యాకానుక పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యాకానుక అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యార్థులకు విద్యాకానుక కిట్లు ఇస్తున్నామని చెప్పారు. ఈ ఒక్క పథకం మీదే ఈ నాలుగు ఏళ్లలో తమ ప్రభుత్వం అక్షరాల రూ. 3,366 కోట్లు ఖర్చు చేసిందని చెప్పడానికి గర్వపడతున్నానని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రతిపక్ష టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. చంద్రబాబు మనస్తత్వం వేరు అని.. పేద పిల్లలు ఇంగ్లీష్‌లో చదువుకుంటే.. వారి చేతుల్లో ట్యాబ్‌లు కనిపిస్తే తట్టుకోలేరని విమర్శించారు. చంద్రబాబుది పేదలకు వ్యతిరేక బుద్ది, పేదలకు బాగుపడకూడదనే దుర్భద్ది అని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పెత్తందారి మనస్తత్వం అని.. గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి తేడా గమనించాలని కోరారు. గతంలో చంద్రబాబు నాయుడు అక్కాచెల్లెమ్మలకు, రైతులకు, యువతకు.. ఎన్నికలకు ముందు వాగ్దానం చేశాడని.. ఎన్నికల తర్వాత మోసం చేశారని విమర్శించారు.
చంద్రబాబు బతుకే మోసం, అబద్దమని అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు పేదలకు వ్యతిరేకమన్నది మరిచిపోవద్దని అన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా.. ఆయన పేరు చెబితే ఒక్క సంక్షేమ పథకం, మంచి పని కూడా గుర్తుకు రాదన్నారు. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు, మోసం, దగా గుర్తుకు వస్తాయని విమర్శించారు. చంద్రబాబు చేసిన పనులు బాగుపడినట్టుగా రాష్ట్రంలో ఏ ఒక్క సామాన్యుడు కూడా చెప్పడం లేదని అన్నారు. చంద్రబాబు ఇంత మోసం చేస్తున్న ఆయనను పలు మీడియా సంస్థలు, దత్త పుత్రుడు వెనకేసుకు వస్తున్నాయని ఆరోపించారు. తనకు దత్తపుత్రుడు, బీజేపీ పార్టీ అండగా ఉండకపోవచ్చని అన్నారు. తాను వీళ్లను నమ్ముకోలేదని, తాను నమ్ముకుంది దేవుడి దయను, ప్రజల ఆశీస్సులను నమ్ముకున్నానని చెప్పారు.
చంద్రబాబు సిగ్గు లేకుండా ఉన్నారని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఈరోజు రాయలసీమ డిక్లరేషన్ అని అంటున్నాడని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ డిక్లరేషన్ అంటూ డ్రామాలు మొదలుపెట్టారని మండిపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశాడు? గాడిదలు కాశాడా? అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. మోసాల చక్రమే చంద్రబాబు సైకిల్ చక్రమని విమర్శించారు.
చంద్రబాబు సామాజిక అన్యాయానికి.. తమ సామాజిక న్యాయానికి మధ్య జరుగుతున్న యుద్దం అని అన్నారు. ఇది చంద్రబాబు పెత్తందారీ భావజాలనికి, పేదలకు మధ్య జరుగుతున్న యుద్దం అని చెప్పారు. ‘‘ఇంటింటికి చేసిన మంచే నా బలం. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో నా ధైర్యం మీరే. మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి. ’’ అని కోరారు. దోచుకో, పంచుకో, తినుకో(డీపీటీ0 కావాలా?.. నేరుగా బటన్ నొక్కితే వచ్చే డీబీటీ కావాలా? అనేది ఆలోచన చేయాలని కోరారు.
