అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మద్యపాన నిషేధ హామీని అమలుపర్చే దిశగా జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల లాక్ డౌన్ సడలింపులో భాగంగా మద్యం అమ్మకాలను ప్రారంభిస్తూ ధరలను 25శాతం పెంచిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ధరలను మరో 50 శాతం పెంచుతూ  ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో  మొత్తంగా అన్నిరకాల మద్యం ధరలు 75శాతం పెరిగాయి. 

కరోనా మహమ్మారి విజృంభణను అడ్డుకునేందుకు చాలాకాలం పాటు రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగింది. ఈ సమయంలో ఏపిలో మద్యం అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయింది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఏపీలో సోమవారం నుండి ప్రారంభయ్యాయి. అయితే మద్యం ధరలను 25శాతం పెంచి అమ్మకాలు చేపట్టింది ఏపి ప్రభుత్వం. 

ఈ ధరల పెంపు మద్యపాన నిషేదం కోసమేనని వైసిపి సర్కార్ ప్రకటించింది. అయితే ప్రతిపక్షాలు, కొంతమంది ప్రజానికం మాత్రం ఇప్పటికే ఉపాది లేక చితికిపోయిన నిరుపేద ప్రజలను దోచుకోడానికే ఈ మద్యం ధరల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందని ఆరోపించాయి. 

 అంతేకాకుండా మద్యం అమ్మకాలు ప్రారంభించిన మొదటిరోజు రాష్ట్రంలోని వైన్ షాపుల ముందు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు  మద్యం కోసం ఎగబడుతూ కిలోమీటర్ల కొద్ది క్యూలైన్లలో నిలుచున్నారు. ఈ క్రమంలో బౌతిక దూరాన్ని పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడం వంటి కరోనా నివారణ కోసం విధించిన నిబంధనల ఉళ్లంఘన జరిగింది. దీనిపైనా స్పందించిన ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 

ఈ క్రమంలో మద్యపాన నిషేదంపై ప్రభుత్వానికి వున్న చిత్తశుద్దిని తెలియజేయడానికి జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మంగళవారం నుండి మరో 50 శాతం మద్యం ధరలను పెంచింది. ఇలా రెండురోజుల్లోనే మొత్తంగా 75శాతంమేర మద్యం ధరలను పెంచింది.  భారీ ధరల కారణంగా అయినా సామాన్యులు మద్యానికి దూరం అవుతారన్నది ప్రభుత్వ  ఆలోచనగా కనిపిస్తోంది. 

పెరిగిన మద్యం ధరలను ఇవాళ్టి నుండి అమల్లోకి రానున్నాయి. అలాగే ఈ నెలాఖరులోగా మరో 15శాతం మద్యం దుకాణాల తగ్గింపునకు ఏపి ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అతి త్వరలో అధికారిక ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి.