Asianet News TeluguAsianet News Telugu

ప్రకాశం జిల్లా దుర్ఘటనపై సీఎం దిగ్భ్రాంతి... మృతుల కుటుంబాలను రూ.5లక్షల సాయం

ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

CM Jagan Reacts on Prakasam Dist Road Accident
Author
PRAKASAM DISTRICT, First Published May 14, 2020, 9:40 PM IST

అమరావతి: ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్‌ ప్రమాదంపై సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారుల ద్వారా  తెలుసుకున్న ముఖ్యమంత్రి మృతుల కుటుంబాలకు అండగా నిలిచారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున తక్షణ సహాయం అందించాలని కలెక్టర్‌కు సీఎం ఆదేశించారు. అలాగే 
క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు.  

ఈ ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించాల్సిందిగా ప్రకాశం జిల్లా మంత్రులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ కుటుంబాలకు అండగా తాము వున్నామన్న భరోసా కల్పించాలని మంత్రులకు స్పష్టం చేశారు.  

ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో ఘోర రోడ్డు  ప్రమాదం సంభవించింది.  మిర్చి కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ప్రమాదంచోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మంది కూలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో కరెంట్ తీగలు మీద పడటం వల్లే ఇంతటి విషాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు.

లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా వ్యవసాయ పనులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతో రాపర్ల సమీప గ్రామాలకు చెందిన కూలీలు ట్రాక్టర్‌పై పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని ట్రాక్టర్‌పై తిరిగి ఇళ్లకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో టాక్టర్లలో దాదాపు 10 నుంచి 15 మంది వరకు వుండొచ్చని భావిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios