సీఎం జగన్ బీసీలకోసం పోరాడే సంఘసంస్కర్త, దమ్మున్న నాయకుడు : ఆర్ కృష్ణయ్య
బుధవారం విజయవాడలో ప్రారంభమైన బీసీ మహానాడులో బీసీనేత ఆర్ కృష్ణయ్య ప్రసంగించారు. బీసీల సంఘ సంస్కర్త వైఎస్ జగన్ అని కొనియాడారు.
విజయవాడ : విజయవాడలో జరుగుతున్న వైఎస్ఆర్ సీపీ జయహో మహాసభలో బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. బీసీలను అభివృద్ది చేసిన దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్ అంటూ కితాబునిచ్చారు. ఏపీలో బీసీలకు ఆత్మగౌరవాన్ని కల్పించింది జగనే అని బీసీ ఉద్యమనేత, వైఎస్సార్ సీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో పదకొండు మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత సీఎం జగన్ దేనని కొనియాడారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న జయహో బీసీ మహాసభలో బుధవారం కృష్ణయ్య మాట్లాడారు. పార్లమెంటులో బీసీ బిల్లును పెట్టిన ఘనత కూడా జగనదేనని కొనియాడారు. బీసీ బిల్లు గనక వస్తే... బీసీల తలరాతలు మారిపోతాయని చెప్పుకొచ్చారు.
బీసీలకు మాయమాటలు చెప్పి, వారిని మభ్యపెట్టారే తప్ప నాయకులెవరూ వారికి ఏమీ చేయలేదన్నారు. తాను బీసీల కోసం ఎన్నో ఉద్యమాలు చేశానని, బీసీ కేంద్రమంత్రుల్ని కూడా కలిశానని.. ఎవ్వరూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలాగా స్పందించలేదని అన్నారు. అంతేకాదు సీఎం జగన్ ఓ సంఘసంస్కర్త అని పొగిడారు. బీసీలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్ అన్నారు. ఆయన బీసీల పక్షాన ఎప్పుడూ నిలిచారని చెప్పుకొచ్చారు.
నేడు వైఎస్సార్సీపీ బీసీ మహాసభ.. సీఎం వైఎస్ జగన్ ప్రసంగించనున్న సభకు భారీ ఏర్పాట్లు
రాష్ట్రంలోని బీసీలు ఇది గుర్తించాలని కోరారు. చిత్తశుద్ధితో నిజంగా బీసీల అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడిని నమ్మాలన్నారు. మాయమాటలకు, మభ్యపెట్టే చర్యలకు లొంగకూడదని.. జగన్ కే మద్ధతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా బీసీ శ్రేణులకు ఆర్.కృష్ణయ్య పిలుపనిచ్చారు.