చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ ఆర్కే రోజా సన్మాన సభలో వైసీపీ నేతల మధ్య పోరుకు వేదికగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా అమరావతిలో ఇటీవల బాధ్యతుల స్వీకరించారు రోజా.. అనంతరం తొలిసారిగా నగరికి వస్తుండటంతో స్థానిక వైసీపీ నేతలు సన్మాన సభను ఏర్పాటు చేశారు.

రోజా దంపతులను ర్యాలీగా సన్మాన వేదిక వదద్దకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో తొలుత రోజా, తర్వాత ఆమె భర్త సెల్వమణి.. అనంతరం పలువురు వైసీపీ నేతలను వేదిక మీదకు పిలిచారు.

అయితే అప్పటి వరకు వేదిక కిందే ఉన్న నగరి మున్సిపల్ మాజీ ఛైర్మన్ కేజే కుమార్, మాజీ ఛైర్‌పర్సన్ కేజే శాంతి తమ వర్గీయులతో వేదిక మీదకు దూసుకువచ్చారు. వచ్చి రావడంతోనే ఎమ్మెల్యే రోజాతో వాగ్వాదానికి దిగారు...

రోజా టీడీపీ తరపున రెండుసార్లు ఓడిపోవడంతో తానే స్వయంగా ఆమెను వైసీపీ తరపున పోటీ చేయించానని కేజే కుమార్ తెలిపారు. అప్పటి నుంచి తన సోదరిగా భావించి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించానని.. అయినప్పటికీ.. తనపై, తన కుటుంబసభ్యులపై టీడీపీ నేతలు అనేక కేసులు బనాయించారని ఆయన వాపోయారు.

జైళ్లో ఉన్నప్పటికీ వైసీపీ కోసం ఎంతో కష్టపడ్డానని.. తీరా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నగరిలో కుల రాజకీయాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఎమ్మెల్యే రోజా కుటుంబ పాలన ఎక్కువైందని కుమార్ ఆరోపించారు.

వీటిని చూస్తూ వూరుకునే ప్రసక్తి లేదని .. సీఎం జగన్ వద్దే తేల్చుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్యే రోజా ఒక వర్గం వారికే పెత్తనం ఇస్తున్నారంటూ కేజే శాంతి ఆరోపించారు. అంతా కుల రాజకీయాలైపోయాయని.. అన్ని వర్గాల వాళ్లు ఒట్లు వేస్తేనే రోజా ఎమ్మెల్యేగా గెలిచారని ఆమె గుర్తు చేశారు.  

ఈ నేపథ్యంలో మధ్యలో కలగజేసుకున్న ఎమ్మెల్యే రోజా తనకు నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు సమానమేనని.. అందరూ ఆదరిస్తేనే తాను ఎమ్మెల్యేని అయ్యానని రోజా తెలిపారు.

పార్టీలో నెలకొన్ని చిన్న చిన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని వెల్లడించారు. వాగ్వాదం ముగిసిన తర్వాత ఆమెను వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు.