Asianet News TeluguAsianet News Telugu

ఉదయగిరి : మాజీ ఎంపీపీ ఫ్లెక్సీలను చించేసిన ఎమ్మెల్యే వర్గీయులు, హైకమాండ్ దగ్గరే తేల్చుకుంటానన్న చేజర్ల

నెల్లూరు జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి, మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డికి మధ్య గత కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా సుబ్బారెడ్డి వర్గం ఫ్లెక్సీలను ఎమ్మెల్యే అనుచరులు చించివేయడం కలకలం రేపింది.

clashes between mla  Mekapati Chandra Sekhar Reddy and ysrcp leaders in udayagiri constituency
Author
First Published Dec 31, 2022, 2:58 PM IST

ఓ వైపు వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 నినాదంతో సీఎం జగన్ శ్రేణుల్ని సిద్ధం చేస్తుంటే.. నియోజకవర్గంలో నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి చోటా నేతల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. కొందరైతే బాహాటంగానే పార్టీలోని తమ ప్రత్యర్ధులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీలోని చాలా చోట్ల అధికార పార్టీ నేతల మధ్య సఖ్యత లేదు. తాజాగా ఉదయగిరి వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి వర్గం ఫ్లెక్సీలను ఎమ్మెల్యే శేఖర్ అనుచరులు చించివేయడం కలకలం రేపింది. దీనిపై చేజర్ల సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి తీరు సరికాదని.. తామూ వైసీపీ నేతలమేనని ఆయన అన్నారు. ఎమ్మెల్యే దమ్ముంటే తనపై పోటీ చేయాలని సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. 

ఇకపోతే.. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో ఆనం రామనారాయణ రెడ్డికి, నేదురుమల్లి రాంకుమార్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా సొంత ప్రభుత్వంపై ఆనం విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే అలా మాట్లాడినట్లు ఆనం పేర్కొన్నారు. వైఎస్ హయాంలో ప్రతిపాదించిన సాగునీటి ప్రాజెక్ట్‌లే పూర్తి కాలేదని రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని ఆనం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారుతానన్నది ఊహాగానాలేనని రామ నారాయణ రెడ్డి కొట్టిపారేశారు. తన గురించి బాతు బచ్చాగాళ్లు మాట్లాడే మాటలు పట్టించుకోనని ఆయన తేల్చిచెప్పారు. కొందరు వెంకటగిరికి ఇన్‌ఛార్జ్‌గా వచ్చి పోటీ చేస్తామంటున్నారని.. ఇది చూసి తాను ఎమ్మెల్యేనేనని జనం అనుకుంటున్నారని ఆనం వ్యాఖ్యానించారు. 

ALso REad: తాడికొండ వైసీపీలో వర్గ విభేదాలు.. ఉండవల్లి శ్రీదేవికి నిరసన సెగ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ముందే అసమ్మతి స్వరాలు

ఆ వెంటనే ఆనం రాంనారాయణ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి. ఆనం మంచి వ్యక్తని పవన్ కల్యాణ్ ఎందుకన్నారని ఆయన ప్రశ్నించారు. నేదురుమల్లి పేరు విన్నా.. తన ఫోటో చూసినా నీకెందుకు భయమని రాంకుమార్ రెడ్డి సెటైర్లు వేశారు. మున్సిపాలిటీలో ఎందుకు గొడవలు జరుగుతున్నాయో నీకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. తాను ఓడిపోయినా వెంకటగిరి వదిలిపోలేదని నేదురుమల్లి చురకలంటించారు. మీరు టీడీపీలో చేరి ఆత్మకూరులో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించారని రాంకుమార్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయాలని.. వివేకానంద రెడ్డి జయంతిని అట్టహాసంగా జరిపారని ఆయన వ్యాఖ్యానించారు. ఎదుటివాళ్లపై మాట్లాడటం కాదని.. మీరు ఏం ఇరగదీశారో చూసుకోవాలంటూ రాంకుమార్ రెడ్డి తీవ్రవ్యాఖ్యలు చేశారు.  

అటు పల్నాడు జిల్లా నర్సరావుపేటలోనూ వైసీపీ వర్గ పోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యేలు కాసు మహేశ్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వర్గాల మధ్య ఫ్లెక్సీల వివాదం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నర్సరావుపేటకు కాసు రాక మాకెంతో ముఖ్యమంటూ కొటేషన్స్‌తో ఆయన వర్గీయులు ఫ్లెక్సీలు పెట్టారు. అంతేకాకుండా వేలాది కరపత్రాలను పంపిణీ చేశారు. ఇది పట్టణంలో తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి కౌంటర్ అన్నట్లుగా లింగంగుట్లలో గతంలో కాసు వెంకట కృష్ణారెడ్డి మంత్రిగా వున్నప్పుడు ఏర్పాటు చేసిన శిలాఫలాకాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టారు. దీంతో పేట వైసీపీ రాజకీయం రసవత్తరంగా మారింది. గురజాల ఎమ్మెల్యేగా వున్న కాసు మహేశ్ రెడ్డి... నర్సరావుపేట టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారని ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు ఎమ్మెల్యేల అనుచర వర్గం తరచుగా ఫ్లెక్సీ వార్‌కు దిగుతోంది. ఇది ఎంత వరకు వెళ్తుందన్నది ఆసక్తిగా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios