స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: చంద్రబాబుకు వైద్య పరీక్షలు పూర్తి.. విచారణ ప్రారంభించిన సీఐడీ బృందం..
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టైనా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు రోజుల సీఐడీ కస్టడీకి విజయవాడలోని ఏసీబీ కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే.

రాజమండ్రి: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టైనా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు రోజుల సీఐడీ కస్టడీకి విజయవాడలోని ఏసీబీ కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజమండ్రి జైలులోనే చంద్రబాబును సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఇందుకోసం సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని బృందం ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకుంది. ఈ బృందంలో ముగ్గురు డీఎస్పీలు, నలుగులు సీఐలు, ఏఎస్సై, కానిస్టేబుల్, వీడియోగ్రాఫర్, ఇద్దరు ఆఫీషియల్ మధ్యవర్తులు ఉన్నారు. తొలుత రాజమండ్రి జైలులోనే చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
అనంతరం సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని బృందం జైలు కాన్ఫరెన్స్ హాలులో స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబును విచారిస్తుంది. ఈ విచారణ సమయంలో కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు తరఫు లాయర్‌కు కూడా అనుమతించారు. కోర్టు అనుమతి మేరకు శని, ఆదివారాల్లో సీఐడీ అధికారులు చంద్రబాబును ప్రశ్నించనున్నారు. రెండు రోజులు కూడా ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చంద్రబాబు విచారణ సాగనుంది. రాజమండ్రి జైలులో చంద్రబాబు విచారణ నేపథ్యంలో.. జైలు పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
ఇక, చంద్రబాబును కస్టడీకి తీసుకోవడానికి ముందు, కస్టడీ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమాబిందు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు దర్యాప్తు ప్రక్రియను వీడియో రికార్డ్ చేయనున్నారు. సీఐడీకి చెందినవారితోనే ఈ ప్రక్రియను చేపట్టాలని.. ఇందుకు సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్‌లో కోర్టుకు అందజేయాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు. విచారణకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు బయటకు రావొద్దని కూడా న్యాయమూర్తి స్పష్టం చేశారు.
అలాగే విచారణ సమయంలో గంటకోకసారి ఐదు నిమిషాల పాటు బ్రేక్ ఇవ్వనున్నారు. అలాగే మధ్యాహ్నం గంట పాటు భోజన విరామం ఇవ్వనున్నారు. విచారణ సమయంలో అవసరమైన వైద్య సదుపాయం కల్పించాలని కూడా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఆదివారం సాయంత్రం కస్టడీ గడువు ముగిసిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ విధానంలో కోర్టు ఎదుట హాజరుపరచాలని కూడా న్యాయమూర్తి తెలిపారు. ఇక, ఈ కేసులో చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా సీఐడీ కోరగా.. రెండు రోజుల సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే.