ప్రేమ పేరిట.. తన చెల్లెలు ఓ మాయగాడి వలలో పడి మోసపోయింది. తనకు న్యాయం చేయడానికి ఆమె సోదరి నానా తిప్పలు పడుతోంది. ఆ మోసగాడిపై పెట్టిన కేసు ఎంత వరకు వచ్చింది..? తన సోదరికి న్యాయం జరుగుతుందా లేదా అన్న విషయం తెలుసుకోవడానికి పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కితే... మరో కామాంధుడు వాళ్లకు తగలాడు. న్యాయం చేయాల్సిన సీఐ.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన కోరిక తీర్చాలంటూ బాధితులను వేధించాడు. ఈ సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...పల్లా కృష్ణకుమారి అనే యువతి ప్రేమలో మోసపోయింది. దీంతో న్యాయం చేయమని రెండు నెలల క్రితం ఎంవీపీ జోన్ పోలీసు స్టేషన్ లో ఆమె సోదరి పల్లా మీనాక్షి ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి ఎంవీపీ జోన్ సీఐ  సన్యాసినాయుడు వాళ్లకు న్యాయం చేయాల్సిందిపోయి.. వేధించడం మొదలుపెట్టాడు.

వారికి ఫోన్ చేసి.. అసభ్యంగా మాట్లాడేవాడని బాధితులు చెబుతున్నారు. తన లైంగిక కోరిక తీరిస్తే... మీ సమస్యను పరిష్కరిస్తానంటూ అసహ్యంగా మాట్లాడాడని వారు ఆరోపిస్తున్నారు. అతని వేధింపులు మరింత తీవ్రతరం కావడంతో బాధితులు మహిళా సంఘాలను ఆశ్రయించారు. వారి సహాయంతో సీఐ సన్యాసినాయుడుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.  బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు విచారిస్తున్నారు.