దసరా ఉత్సవాల్లో ఓ మహిళా కానిస్టేబుల్ ని సీఐ అసభ్యకరంగా దూషించాడు. దీంతో... ఆమె అక్కడే కన్నీరు పెట్టుకొని విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లింది.  ఈ సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... దసరా ఉత్సవాల్లో విధులకు గోదావరి జిల్లా నుంచి సీఐ, ఓ మహిళా కానిస్టేబుల్ హాజరయ్యారు.  వీరు ఘాట్ రోడ్డులోని ఓంకారం మలుపు వద్ద విధులు నిర్వహిస్తున్నారు.  కాగా... ఈ ఉత్సవాల్లో విధులకు వచ్చిన రోజు నుంచి సీఐ ఆమెను అసభ్యకరంగా తిట్టడం గమనార్హం.  ఆదివారం రాత్రి కూడా సీఐ మరింత రెచ్చిపోయి అసభ్యకరంగా దూషించటంతో కంటతడి పెట్టుకుంది. 

అదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఉన్నతాధికారికి బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో సహచర కానిస్టేబుళ్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం కెనాల్ రోడ్డు రథం సెంటర్ వద్ద ఓ కానిస్టేబుల్ వలంటీర్‌పై చేయిచేసుకున్నాడు. పోలీసుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.