Asianet News TeluguAsianet News Telugu

పదో తరగతి ప్రశ్న పత్రం లీక్ కేసు.. మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు..

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ప్రశ్న పత్రాల లీక్ కేసులో నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకులు, మాజీ మంత్రి నారాయణకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి నారాయణ బెయిల్ రద్దు చేస్తూ చిత్తూరు జిల్లా తొమ్మిదో అదనపు కోర్టు తీర్పు వెలువరించింది.

Chittoor Court Cancels EX Minister Narayana Bail in Class 10 paper leak case
Author
First Published Oct 31, 2022, 1:22 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ప్రశ్న పత్రాల లీక్ కేసులో నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకులు, మాజీ మంత్రి నారాయణకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి నారాయణ బెయిల్ రద్దు చేస్తూ చిత్తూరు జిల్లా తొమ్మిదో అదనపు కోర్టు తీర్పు వెలువరించింది. పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కేసులో ఈ ఏడాది మేలో నారాయణను అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు.. చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. అయితే కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే నారాయణ బెయిల్ రద్దు చేయాలని చిత్తూరు వన్ టౌన్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన చిత్తూరు జిల్లా తొమ్మిదో అదనపు కోర్టు నారాయణ బెయిల్ రద్దు చేసింది. నవంబర్ 30వ తేదీలోపు నారాయణ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. 

ఇక, ఈ ఏడాది పదో తరగతి తరగతి పరీక్షల సందర్భంగా పలుచోట్ల ప్రశ్న పత్రాలు లీక్ కావడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఏప్రిల్ 27న తిరుపతిలోని నారాయణ విద్యాసంస్థలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన  పరీక్ష ప్రశ్నపత్రాన్ని లీక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పరీక్ష ప్రారంభమైన గంట తర్వాత నిందితుడు ప్రశ్నపత్రాన్ని ఫోటో తీసి సోషల్ మీడియా గ్రూప్‌లో పోస్ట్ చేశాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసులు నారాయణ విద్యాసంస్థలకు చెందిన పలువురు సిబ్బందితోపాటు, నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరు పరిచారు. 

అయితే నారాయణ ట్రస్ట్‌కు 2014లో నారాయణ రాజీనామా చేశారని, మేనేజ్‌మెంట్‌తో ఆయనకు సంబంధం లేదని ఆయన తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే చిత్తూరు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష చొప్పున ఇద్దరి పూచీకత్తుపై ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios