సూర్యాపేట వద్ద జరిగిన కారు ప్రమాదంలో మెగాస్టార్ చిరంజీవి క్లాస్ మేట్ మృతిచెందాడు. కారులో విజయవాడ నుండి హైదరాబాద్ వెళుతుండగా సూర్యాపేట వద్ద ప్రమాదానికి గురై మరణించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఆగర్తిపాలెంకు చెందిన మైలాబత్తుల సత్యానందం, ఆయన భార్య విజయకుమారి తోపాటుగా వారి కుమారుడు జోసఫ్‌ మరణించాడు. 

సత్యానందం రాజమండ్రి డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. అలాగే ఈయన భార్య విజయకుమారి కూడా ఉపాధ్యాయురాలిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఉద్యోగ విరమణ తరువాత వారు కుటుంబంతోసహా రాజమండ్రిలో స్థిరపడ్డారు. 

వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. జోసఫ్‌ విజయవాడలో ఇంటీరియల్‌ డిజైనర్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. సత్యానందం భార్య విజయకుమారికి అనారోగ్యంగా ఉండడంతో వారు విజయవాడలోని కుమారుడు జోసెఫ్ ఇంటికి వచ్చారు. అక్కడి నుండి వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తీసుకెళ్తుండగా... మార్గమధ్యలో జరిగిన ప్రమాదంలో ముగ్గురూ మరణించారు.  

మెగాస్టార్ చిరంజీవికి సత్యానందం చిన్ననాటి స్నేహితుడు. చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నారు. కాలేజీ లో కూడా ఇద్దరు మంచి మిత్రులు. ఇద్దరు కూడా నరసాపురం వైఎన్‌ కళాశాలలో డిగ్రీ చదివారు.

నేటి ఉదయం వారి అంత్యక్రియలను అగర్తపాలెం క్రైస్తవ స్మశాన వాటికలో నిర్వహించనున్నారు. సత్యానందం మృతిపట్ల గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. పలువురు ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే నిమ్మలరామనాయుడితో సహా మాజీ ఎమ్మెల్యేలు, మండల కార్యదర్శులు వచ్చి సత్యానందం కుటుంబానికి తమ సంతాపాన్ని తెలియజేశారు.