కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం పార్టీ అదికారంలోకి వస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని లెక్కలు వేసుకున్నా అధికారంలోకి వచ్చేది మాత్రం తెలుగుదేశం పార్టీయేనని జోస్యం చెప్పారు. 

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చినరాజప్ప ప్రజలు మళ్లీ టీడీపీకే పట్టంకట్టారని తెలుస్తోందన్నారు. ఈ సందర్భంగా సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చినరాజప్ప నిప్పులు చెరిగారు. 

చంద్రబాబు ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిందన్న విషయం గుర్తుందా అని నిలదీశారు. సీఎస్ కి పాలనకు సంబంధం ఏంటని నిలదీశారు. ప్రస్తుతం తుఫాన్ వణికిస్తోందని..సహాయక చర్యలపై సమీక్షలు చేయకూడదంటే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. 

సీఎం సహాయనిధికి సంబంధించి చెక్కులు బౌన్స్ అవుతున్నాయని దానికి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బాధ్యత వహిస్తారా అంటూ నిలదీశారు. అధికారులను గుప్పెట్లో పెట్టుకుని కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. 

రాష్ట్రంలో ఎన్నికలు పూర్తైన తర్వాత ఎన్నడూ లేనంతగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఫలితాలు వెలువడేందుకు 45 రోజుల గ్యాప్ ఉండగా ఆ సమయంలో ప్రభుత్వం ఎలాంటి సమీక్షలు చేయరాదంటూ ఆదేశాలు జారీ చెయ్యడం తప్పని చినరాజప్ప అభిప్రాయపడ్డారు.