నెల్లూరు: నెల్లూరు జిల్లావిడవలూరు మండలం ఊటుకూరు పెదపాలెంలో విషాదం చోటు చేసుకుంది. బోరుబావిలోపడ్డ చిన్నారి మృతిచెందింది. పెదపాలెంలో ఆటలు ఆడుకుంటూ ఇద్దరు చిన్నారులు బోరుబావిలో పడిపోయారు. 

సుమారు 10 అడుగుల లోతు బోరుబావిలో చిన్నారులు ఇద్దరు పడిపోయారు. బోరుబావిలో చిన్నారులు పడిపోయారని గమనించిన స్థానికులు సహాయకచర్యలు చేపట్టారు. ఒకవైపు చర్యలు చేపడుతూనే మరోవైపు రెవెన్యూ శాఖ అధికారులకు సమాచారం అందించారు. 

తొలుత నాలుగేళ్ల బాబు గోపిరాజును రక్షించారు స్థానికులు. అయితే మూడేళ్ల మోక్షిత లోపలికి వెళ్లిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాన్ని తవ్వి ఆ పాపను రక్షించగలిగారు. సుమారు రెండుగంటలపాటు శ్రమించిన స్థానికులు పాపను బయటకు తీశారు. 

ఆపస్మారక స్థితిలో ఉన్న చిన్నారికి వైద్యపరీక్షలు అందించేందుకు ఆస్పత్రికి తరలించారు. ప్రాణాలతో పోరాడిన మోక్షిత చికిత్సపొందుతూ దుర్మరణం చెందింది. దీంతో గ్రామంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.