గంగవరం మండలం జీఎల్ఎస్ ఫారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ర్యాంపు గోడ కూలి విద్యార్థి మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. 1-9 తరగతుల విద్యార్థులకు మంగళవారం నుంచి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే కోడిగుడ్లు చెడిపోతాయనే ఉద్దేశంతో పాఠశాల హెడ్ మాస్టర్ సుమిత్ర గుడ్లు తీసుకెళ్లడానికి ఉదయం పిల్లల్ని పిలిపించారు. 

పాఠశాలకు సమీపంలో కాపురముంటున్న 5వ తగరతి విద్యార్థి లిఖితేశ్వర్ (11) కూడా కోడిగుడ్డు కోసం వెళ్లాడు. స్థానిక ఎన్నికల్లో వికలాంగులు ఓట్లేయడం కోసం ర్యాంపుకు అనుబంధంగా పాఠశాల దగ్గర చిన్న గోడ నిర్మించారు. 

గుడ్లు తీసుకోవాలన్న తొందరలో లిఖితేశ్వర్ దాన్ని ఎక్కాడు. అయితే గోడ బలహీనంగా ఉండటంతో కూలిపోయింది. అదుపు తప్పిన బాలుడు తటాలున కింద పడటం.. అతని తలమీద గోడ పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే గమనించిన పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించే లోపు మృతి చెందాడు. 

ప్రధానోపాధ్యాయిని ఫోన్ చేసి తమ పిల్లాడిని కోడిగుడ్ల కోసం పిలిపించారని, ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తమ బిడ్డ మృత్యువాతపడ్డాడని తల్లి లతశ్రీ ఆరోపించారు. ఈ మేరకు గంగవరం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.