ప్రేమించి తనను మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళనకు దిగింది. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం కీలేశపురానికి చెందిన పచ్చిగోళ్ల జోసెఫ్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని అదే గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మీ అనే యువతి సోమవారం రాత్రి నుంచి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది.

దీనిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని.. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె అక్కడ బైఠాయించింది. మరోవైపు భాగ్యలక్ష్మీ ఆరోపణలపై జోసెఫ్ కుటుంబసభ్యుల నుంచి ఎలాంటి ప్రతిస్పందనా రాలేదు.

రాత్రంతా ఆమె ధర్నా చేస్తున్నా ఎవరు పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భాగ్యలక్ష్మీకి ప్రజాసంఘాలు, స్థానికులు మద్ధతు పలికారు. దీనిపై భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ.. తనకు జోసెఫ్‌తో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడిందని, అది కాస్తా ప్రేమగా మారినట్లు తెలిపింది.

పెళ్లి చేసుకుందామని తాను ఒత్తిడి తీసుకురావడంతో జీవితంలో స్థిరపడ్డాక చూద్దామని జోసెఫ్ చెప్పాడని ఆమె పేర్కొంది. ఈ క్రమంలో తాను గర్భం దాల్చానని అప్పటి నుంచి పెళ్లి గురించి ప్రస్తావిస్తుండగా దానిని అతను దాటవేస్తూ వెళ్లాడని ఆమె వెల్లడించింది.