అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలు తెలుగుదేశం పార్టీ వీడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక నేత తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. 

గుంటూరు జిల్లాలో అత్యంత సీనియర్ నేత చందూ సాంబశివరావు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీ సభ్యత్వానికి, అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. 

చందూ సాంబశివరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే గత కొంతకాలంగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేసేవారు. 

దానికితోడు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలవ్వడంతో ఆయన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. దాంతో పదవులకు రాజీనామా చేశారు. సాంబశివరావు విద్యావేత్త. నాసా, ఇస్రోలలో శాస్త్రవేత్తగా పనిచేశారు. అంతేకాదు అమెరికాలోని వివిధ అంతర్జాతీయ సంస్థలలో ఐటీ విభాగంలో విశేష సేవలందించారు.  

తెలుగుదేశం పార్టీకి, పదవికి రాజీనామా చేసిన చందూసాంబశివరావు త్వరలోనే బీజేపీ గూటికి చేరతారని ప్రచారం జరుగుతోంది. ఈనెల 14న గుంటూరులో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది.